న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అత్యంత దుర్భేధ్యపు కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ ఆధ్వర్యంలో ఓ కమెండో ట్రైనింగ్ స్కూల్ ఆరంభం కానుంది. తమ దళాలకు ప్రత్యేక గెరిల్లా, కమెండో తరహా శిక్షణ కోసం ఈ శిక్షణ సంస్థను ఈ ప్రాంతపు భౌగోళిక పరిస్థితి నేపథ్యంలో ఎంచుకున్నారు. ఈ కర్రెగుట్ట హిల్స్ ప్రాంతం కంచుకోటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన అటవీ యుద్ధ తంత్ర కమెండో విభాగం కోబ్రా, స్థానిక పోలీసు బలగాలు కలిసి మూడు వారాల పాటు విస్తృత స్థాయిలో అనువైన ప్రదేశం కోసం గాలించాయి.ఈ క్రమంలోనే 60 కిలోమీటర్ల పొడవు, 520 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ప్రాంతాన్ని తమ స్థావరంగా ఎంచుకున్నారని అధికార వర్గాలు పిటిఐ వార్తాసంస్థకు తెలిపాయి.
కొండలు, కందకాలు, పైగా దట్టమైన అటవీప్రాంతం, గబ్బిలాలు, కందిరీగలు, ఎలుగుబంట్లు ఉండే ఈ ప్రాంతం తమ కదలికలకు అత్యంత రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందని వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడనే ఎప్రిల్ మే మధ్యలో కోబ్రా ఇతర దళాల తీవ్రస్థాయి గాలింపు చర్యల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ 31 మంది వరకూ మావోయిస్టులు మృతి చెందారు.ఈ దశలోనే ఈ ప్రాంతంలో కమెండో సెంటర్‌ను పెట్టాలని సిఆర్‌పిఎఫ్ వర్గాలు ఆలోచించాయి. నక్సల్ ఏరివేత లక్షం వచ్చే ఏడాది మార్చి నాటికి నెరవేరుతుందని అమిత్ షా పదేపదే చెపుతూ వస్తున్న దశలో , మారుమూల అడవుల్లో నక్సల్స్‌పై పోరును మరింత తీవ్రతరం చేసే తగు శిక్షణ, పటిమను బలగాలకు కల్పించేందుకు నిర్ణయించారు. ఎప్రిల్ మే నెలల్లో జరిఇన కర్రెగుట హిల్స్ ఆపరేషన్‌ను భద్రతా బలగాలు తమ అత్యంత భారీవిజయంగా భావించుకుంటున్నాయి.
సిఆర్‌పిఎఫ్‌కు చెందిన అనుభవజ్ఞులైన వారిని , అటవీ , కొండ ప్రాంతాలలో దాడులు, గెరిల్లా తరహా పోరాట పటిమ ఉండే వారిని ఎంచుకుని ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. కెజిహెచ్ ఆపరేషన్ తరువాత ఇది సిఆర్‌పిఎఫ్‌కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యూహాత్మక కార్యాచరణ అని వెల్లడైంది. ఏ విధంగా దీనిని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ఖరారు అయింది. ఇక సిఆర్‌పిఎఫ్ స్కూల్ ద్వారా కమెండో శిక్షణ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీని వల్ల ఈ ప్రాంతం శత్రువుల కదలికలు, ఉనికికి దూరంగా ఉండేలా చేయడం జరుగుతుందని ఓ అధికారి చెప్పారు.
ఈ గుట్టలలో వాతావరణం తీవ్రస్థాయిలో ఎండలు, చలితో ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా ఇతర వ్యక్తులకు చేరుకునే లేదా ఉండేందుకు అవకాశం లేనిది. అందుకే దీనిని చాలా కాలం వరకూ నక్సల్స్ దళాలు తమ స్థావరంగా వాడుకున్నాయి. ఇప్పుడు నక్సల్స్‌పై అంతిమ విజయం కోసం ఈ ప్రాంతం నుంచే వారిపై సర్వశక్తులతో దెబ్బకొట్టేందుకే ఈ కమెండో స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడైంది.