మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్‌లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శ కులు సూర్యలంక బీచ్‌తో పాటు వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు.
ఈ క్రమలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ సాయి, మణిద్వీప్, జీవన్ సాత్విక్‌లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపా డేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్, మణిదీప్‌ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్‌తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్నిమాపక, మత్సశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని బాపట్ల ఎస్పీ ఉమా మహేశ్వర్ పరిశీలించారు.
మంగినపూడి బీచ్ వద్ద యువకులను కాపాడిన మెరైన్ సిబ్బంది..
ఇదిలా ఉండగా, బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ వద్ద నీళ్లలో కొట్టుకుపోతున్న నలుగురు యువకుల్ని పోలీసులు, మెరైన్ సిబ్బంది రక్షించారు. ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో మంగినపూడి బీచ్ రద్దీతో కిటికీటలాడుతోంది. సముద్ర తీరా ప్రాంతంలో అలల తాకిడికి కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో నలుగురు యువకుల్ని కాపాడారు. అబ్దుల్ అసిఫ్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్, ఎండి అన్వర్, అనే యువకులను మెరైన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడి నందుకు యువకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన ధైర్యసాహసాలను పర్యా టకులు ప్రశంసించారు.