మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై ఏమి చేయగలనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నా రిజర్వేషన్లపై ఏమీ చేయలేకపోయామని ఆయన చెప్పారు. గతంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని ఆయన ఉదహరించారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండరాదని లోగడ సుప్రీం కోర్టు క్యాప్ విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే ఈ విషయంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏమి చేయగలనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అయితే బిసి రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నానికే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నించగా, ముగ్గురు ఆశావాహుల పేర్లతో జాబితాను తమ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు పరిశీలనలో ఉందన్నారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని వెల్లడించనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.