ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణదేవాలయంలో దాగిన ఖలిస్తానీ వేర్పాటువాదులను బయటకు రప్పించే మార్గం ఉందన్నారు. 1984లో అమృత్సర్‌లోని స్వర్ణ మందిరంలో ఖలిస్తానీ వేర్పాటువాదులను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు మార్గం అని తెలిపారు.. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీలో జరిగిన ఖుష్వంత్ సింగ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాత్రికేయురాలు హరీందర్ బావేజా రాసిన ‘దే విల్ షూట్ యూ మేడమ్’ అనే పుస్తకంపై చర్చ సందర్భంగా చిదంబరం మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఒక్కరే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆర్మీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారని, ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ ప్రాణాన్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు.
సైన్యంలో ఉన్న అధికారులపై ఎలాంటి అనుమానాలు లేవు కానీ స్వర్ణ మందిరాన్ని తిరిగి పొందేందుకు తీసుకున్న విధానం తప్పుదారి అని చిదంబరం తెలియజేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత తాము సైన్యాన్ని జోక్యం లేకుండానే స్వర్ణ మందిరాన్ని తిరిగి పొందగలిగామని, అదే సరైన విధానమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న నిజమైన సమస్య ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తాను పంజాబ్‌లో పర్యటించినప్పుడు తెలిసిందన్నారు. ఖలిస్తాన్ లేదా విభజన అనే రాజకీయ నినాదం ఇప్పుడు పంజాబ్ లో దాదాపుగా అంతరించిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో ప్రజలు పంజాబ్ నుంచి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని చిదంబరం పేర్కొన్నారు.