మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్‘ అనే థీమ్‌తో నిర్వహించిన ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎనిమిదో ఎడిషన్‘ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మందిని కబళిస్తున్న కాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరి పై ఉందన్నారు. ‘ఆరోగ్య తెలంగాణ ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. సమాజంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినంధించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.