సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, బిసి రిజర్వేషన్‌లతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం -ఉన్నట్టుగా తెలిసింది. ప్రతి 15 రోజులకు కేబినెట్ సమావేశం ఒకసారి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరదలు, బిసి రిజర్వేషన్ల హడావిడి తదితర కారణాలతో కొంతకాలంగా కేబినెట్ సమావేశం జరగలేదు. అందులో భాగంగా ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో ప్రధానంగా ఎస్‌ఎల్‌బిసీ సొరంగం పనులు ప్రారంభించే అవకాశం, దీంతో పాటు వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తమ్మిడిహట్టి వద్ద నిర్మాణం, సమ్మక్క-సారక్క ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.