బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయ పార్టీలు ప్రత్యేకించి మహిళలను ఆకర్షించడానికి అనేక ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 3న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద దాదాపు 25 లక్షల మంది మహిళలకు వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 10 వేలు వంతున జమ చేశారు. అంతకు ముందు సెప్టెంబర్ 26న ఇదే పథకం కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 7500 కోట్లు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ విధమైన పోకడ ఇతర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించవచ్చు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం నిదానంగా పెరుగుతోన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ నిర్ణేతలు మహిళలవుతారా? ఇంటాబయటా చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్న మహిళలకు ఈ ప్రయోజనాలతో ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇది వారికి మరింత గౌరవం, స్వేచ్ఛ, భద్రతను కలిగిస్తాయి. కానీ అదే సమయంలో లబ్ధిదారులుగా వారికి చేరువైన ఈ మార్గం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.
సంబంధిత మహిళల రాజకీయ నియోజకవర్గంలో ‘రాజకీయేతర వ్యవస్థ’ను నిర్మించడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతోంది. ఇది మహిళలను చురుకైన పౌరులుగా కాకుండా అంతగా ప్రాముఖ్యత లేని ఉత్త పాత్రధారులుగా ఉంచుతుంది. ఈ పథకాలు కూడా మహిళలను చెల్లెమ్మలు, అక్కలుగా సంబోధిస్తున్నాయి. ప్రధాన పోటీదారులు, విధానపరమైన నిర్ణయం తీసుకునేవారు సోదరులు, పురుషులు అయినప్పుడు ఈ పథకాల్లో మహిళలను చెల్లెమ్మలుగా అభివర్ణించడం వారిని దూరంగా ఉంచే ఆలోచన కోసమే. ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములుగా మహిళా ఓటర్లు కీలకపాత్ర వహించడం సానుకూల పరిణామం. ఇప్పుడు మేనిఫెస్టోలన్నీ మహిళా ఓటర్లకే అంకితమవుతున్నాయి. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఈ ప్రమాణాలన్నీ మహిళలకు సహాయ పడుతున్నాయి. కేవలం నగదు పథకాలే కాదు. 2000 సంవత్సరం మొదటి భాగంలో నితీశ్‌కుమార్ పాఠశాల బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది కొన్నేళ్ల పాటు మహిళలపై విశేష ప్రభావాన్ని చూపించింది. మహిళలకు టాయిలెట్లు ఎక్కువ సంఖ్యలో నిర్మించే ప్రయత్నాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇవి సరైన దిశలో సాగుతున్న ప్రయత్నాలు. అయితే మహిళలు కోరుకునేవన్నీ ఉచితాలే అని భావించే ప్రమాదం ఉంది. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే మహిళలకు ఈ పథకాలను ప్రకటించకుండా దీన్ని అంతర్గతీకరించే అవసరం ఉంది.
తమిళనాడు లోని ఊర్మిళ తొగై స్కీమ్, మధ్యప్రదేశ్ లోని లాడ్లీ బహనా యోజన, మహారాష్ట్ర లోని లడ్‌కీ బహిన్ యోజన, తదితర పథకాలు స్వల్ప, మధ్యాదాయ మహిళా ఓటర్లకు ప్రత్యక్షంగా నగదు అందించాయి. మధ్యప్రదేశ్ లోని లాడ్లీ బహనా యోజన స్కీమ్ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మేలు చేసింది. అలాగే మహారాష్ట్ర లోని లడ్‌కీ బహిన్ యోజన బిజెపి సంకీర్ణానికి ఎంతో లబ్ధి చేకూర్చింది. అయితే ఈ పథకాలు సవ్యంగా అమలు కావాలి. ఎన్నికలకు నెలరోజులు ముందుగా ఈ ఉచిత హామీల పథకాలను ప్రకటించగానే సరిపోదు, లబ్ధిదారులకు అవి చేరువ కావాలి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీర్ భండార్ పథకం లేదా మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా పథకం పరిశీలిస్తే కొన్ని షరతులతో వీటిని అమలు లోకి తీసుకొచ్చారు. ఈ పథకాల లబ్ధిదారులైన మహిళా ఓటర్లు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇవన్నీ తల్లిదండ్రులు తమ బాలికలను చదివించడానికి దోహదం చేసే రాయితీలు. జాతీయ ఎన్నికల అధ్యయనంలో భాగంగా చేపట్టిన కొన్ని సర్వేలు ఏ పార్టీకైనా విజయాన్ని నిర్ణయించేది మహిళా ఓటర్లే అని స్పష్టం చేశాయి. ముఖ్యంగా బిజెపికి ఈ అంశం చాలా ముఖ్యం. వాస్తవానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో సిద్ధాంతాలపై కాకుండా ప్రత్యక్ష అనుభవపూర్వక పరిశోధనల్లో గెలుపు కూటమికి పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు అంతగా ఓటు వేయలేదని తేలింది. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బిజెపి ఓటర్లలో చారిత్రకంగా లింగ వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రాంతీయ స్థాయిలో ఇలాంటి అంతరానికి భిన్నంగా మహిళలు ఓటు వేయడం గమనార్హం.
ఈ ఉచిత పథకాలు అమలు విధానం కూడా కీలకపాత్ర వహిస్తుంది. మహారాష్ట్రలో ఎన్నికలైన తరువాత ఉచిత పథకాల అమలు అస్తవ్యస్తమైంది. లబ్ధిదారుల ఎంపికలో స్క్రూటినీ పెరిగింది. ఈ పథకాన్నా లేక పెన్షన్ పథకాన్నా దేన్ని ఎంచుకోవాలో మహిళలు తెలియక తికమకపడ్డారు. అంతేకాదు లబ్ధిదారులైన మహిళలు డబ్బును స్వతంత్రంగా వినియోగిస్తున్నారా లేదా అన్న పరిశీలన జరుగుతోంది. ఇవన్నీ క్రమంగా సర్దుకోబడవచ్చు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కసరత్తులో ఓటర్ల జాబితానుంచి పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ శాతం తొలగించబడ్డారు. ఈ పరిస్థితుల్లో మహిళా ఓటర్లను పార్టీలు ఎలా ఆకట్టుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఓటర్ల జాబితా తయారైన ప్రతిసారి మహిళలు ఇలాంటి చిక్కుల్నే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీరి డాక్యుమెంటేషన్ బలహీనం. అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కసరత్తులో కూడా మహిళలు సంఘర్షణకు గురయ్యారు. కొంతమంది పెళ్లి చేసుకుని అసోంకు వచ్చారు. కానీ తాము ఎక్కడనుంచి వచ్చామో నిరూపించలేకపోయారు. రాజకీయ పార్టీలు ఇలాంటి చిక్కులను విడదీసి వారిని ముందుకు తీసుకురావడం చాలా ముఖ్య కర్తవ్యం. పురుషుల్లా మహిళలు కూడా భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాంటప్పుడు వారి ఓటు హక్కును కొల్లగొట్టడం అన్యాయమే అవుతుంది.