టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మైదానంలో చూడక చాలాకాలమే అయింది. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో అతను పాల్గొని.. జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను బిసిసిఐ ఫిట్‌నెస్ టెస్ట్‌ని కూడా పాస్ అయ్యాడు. ఈ సిరీస్‌లో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మాన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసందే. కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో పాత హిట్‌మ్యాన్‌ను చూపించాలని అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లే రోహిత్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
తాజాగా ముంబై మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ అధ్వర్యంలో రోహిత్ సుమారు రెండు గంటల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్‌లో అతడు భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. ఇందులో భాగంగా రోహిత్ కొట్టిన ఓ భారీ సిక్స్ దెబ్బకు బంతి వెళ్లి పార్కింగ్‌లో ఉన్న తన 4.57 కోట్ల విలువైన లంబొర్గిని కారు అద్దం బద్దలుకొట్టింది. శివాజీ పార్క్‌లో జరిగిన ఈ ప్రాక్టీస్‌లో రోహిత్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాక్టీస్ ముగించుకొని వెళ్లిపోతున్న రోహిత్‌ను కలిసేందుకు ఓ చిన్నారి అభిమాని వచ్చాడు. అతడిని రోహిత్ సెక్యూరిటీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా.. రోహిత్ వారిపై మండిపడ్డాడు. చివరికి ఆ చిన్నారితో రోహిత్ ముచ్చడించాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది.