మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : మంచిర్యాల జిల్లా, వేమనపల్లి బిజెపి అధ్యక్షుడు యాట మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ డిమాండ్ చేశారు. యాట మధుకర్ కుటుంబా న్ని శనివారం పరామర్శించిన ఆయన కాంగ్రెస్ నేత ల, పోలీసుల అరాచకాలను వివరిస్తూ రోదించిన మధుకర్ కుటుంబ సభ్యులు, వారి పరిస్థితిని చూసి తీవ్రంగా చలించి పోయారు. మధుకర్ కుటుంబాన్ని అన్నివిధాలా బిజెపి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘’48 గంటలు టైమిస్తున్నా.. మధుకర్ చావుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. కారకులైన పోలీసులను సస్పెండ్ చేయాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయ్, హైదరాబాద్‌తోపాటు రామగుండం కమిషనరేట్‌ను పార్టీ కార్యకర్తలతో కలిసి ముట్టడిస్తాం. కార్యకర్తలే బాధ్యులకు తగిన గుణపాఠం చెబుతారు. అంతదాకా తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని హెచ్చరించారు. యాట మధుకర్ ది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రేరేపిత హత్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకాలు, దౌర్జన్యాలతోపాటు పోలీసుల వేధింపులు తాళలేకే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.
కాంగ్రెస్ నేతల వేధింపులు, ఇంటిపై దాడి చేసి దౌర్జన్యం చేయడమే కాకుండా మధుకర్ పైనే అత్యాచార యత్నం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టి తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు వాపోయారు. పోలీసుల వేధింపులు, కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యాలు భరించలేకే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. వెంటనే ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. కాంగ్రెస్‌పైన, పోలీసుల తీరుపైనా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ‘పోలీసులు అధికార పార్టీ నాయకుల అరాచకాలకు వత్తాసు పలుకుతూ మధుకర్ లాంటి వారిని వేధిస్తున్నరు. ఏ ప్రభుత్వం శాశ్వంతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. రాష్ట్రంలోనూ రాబోయేది బిజెపి ప్రభుత్వమే. ఈసారి అట్లాంటి వాళ్లందరికీ చుక్కలు చూపిస్తాం. గూండాగిరీ చేసే వాళ్లను యుపి తరహాలో శిక్షిస్తాం. బిజెపి కార్యకర్తలారా….ఎవరూ ఆందోళన చెందవద్దు. నిరాశ పడొద్దు. ఆత్మహత్యలే పరిష్కారం కాదు. తెగించి పోరాడేవాడే నిజమైన బిజెపి కార్యకర్త’ అని అన్నారు.