గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి విజయం నమోదు చేసింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో కివీస్ మహిళల 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 39.5 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగి బౌలింగ్ చేశారు. వరుస క్రమంలో వికెట్లను పడగొడుతూ బంగ్లా బ్యాటర్లకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఒక దశంలో 33 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఫాతిమా ఖాతూన్, నాహిదా అక్తర్, రాబియా ఖాన్‌లు అద్భుత పోరా పటిమను కనబరిచి జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఫాతిమా (34), నాహిదా (17), రాబియా (25) పరుగులు చేశారు. మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో జెస్ కెర్, లియా తహుహు మూడేసి వికెట్లను తీశారు. రోజ్‌మేరీకి రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను కెప్టెన్ సోఫియా డెవిన్ (63), బ్రూక్ హాలిడే (69) ఆదుకున్నారు.