మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు అని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఎఇ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్ పోటీలు 2025కి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా -ఈ రేస్ నిర్వహణ గురించి కెటిఆర్ ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగెత్తినప్పుడు,
భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైందని అన్నా రు. ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిందని పేర్కొన్నారు. ఈ ఫార్ములా- ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమే అని, తెలంగాణ స్థిరమైన, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందనిదని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ భారతదేశ మొబిలిటీ వ్యాలీగా ఆవిర్భవించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఐటీ మంత్రిగా తన హయాంలో, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ- హబ్, భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రమైన టీ- వర్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఎలా నిర్మించిందో వివరించారు.
యువత ఉద్యోగాలు సృష్టించాలి: కెటిఆర్
అవకాశాల కోసం ఎదురుచూడకుండా, వాటిని మీరే సృష్టించుకోవాలని వందలాది మంది యువ ఇంజనీర్లకు కెటిఆర్ పిలుపునిచ్చారు. మీరు సొం తంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడా లి..? అంటూ యువత ఇంజనీర్లను అడిగారు. ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారావాలని అన్నారు. మీరు పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత, మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని యువ త ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.