మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుం టే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా స హకరిస్తోందని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ధ్వ జమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని కేంద్ర మం త్రి సిఆర్ పాటిల్ సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారన్నారని చెప్పారు. 20 రోజుల కింద సిఆర్ పాటిల్ లేఖ రా సినా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. వరద జలాల పై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూడదు అని.. కానీ, బనకచర్ల ప్రాజెక్టు పిఎఫ్‌ఆర్ పరిశీలిస్తున్నామని కేంద్రం రాసిన లేఖపై రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పం దించలేదని ధ్వజమెత్తారు. కేంద్రం అండతో ఎపి ప్రభుత్వం బనకచర్లపై ముం దుకెళ్తోందని, రేవంత్‌రెడ్డి దీన్ని అడ్డుకోపోగా..పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు డిపిఆర్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి లేఖ రాశారని, దీనిపై రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ లేఖపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్‌ఎస్ చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్నారు. కమీషన్ల కోసం సిఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 423 టిఎంసిల గోదావరి జలాలను ఎపి మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతున్నా సిఎం రేవంత్‌రెడ్డి స్పందించట్లేదని విమర్శించారు. సిఎం ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నీటి వినియోగంపై వ్యక్తం చేశారు. 423 టిఎంసిలు ఎపి మళ్లించుకుంటోందని కాబట్టి 112 టిఎంసిలు ఆల్మట్టిలో ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసిందని తెలిపారు.మరో వైపు వరద జలాలతో విదర్భలో ప్రాజెక్టులు కట్టుకుంటామని మహారాష్ట్ర సిద్ధమవుతోందని చెప్పారు. ఎపి 463 టిఎంసిలు, కర్ణాటక 112 టిఎంసిలు, మహారాష్ట్ర 74 టిఎంసిల నీటిని ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. కింద గోదావరి, పైన కృష్ణా నీళ్లు వాళ్లు తీసుకుపోతే మన బతుకులు ఏం కావాలి..? అని అడిగారు. ఇంత జరుగుతున్నా సిఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా..? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు… నల్లమల పిల్లి
‘రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు… నల్లమల పిల్లి’ అంటూ హరీష్‌రావు ఘాటుగా విమర్శించారు. తరచూ తనను తాను ‘నల్లమల బిడ్డ’ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నల్లమలను ఆనుకుని ప్రవహించే కృష్ణా నదికి, మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. పొరుగు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో సిఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ఇటీవల కర్ణాటకకు వెళ్లిన రేవంత్ రెడ్డి, అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్న కనీస సోయి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో రాహుల్ గాంధీ ద్వారా ఒక్క ఫోన్ కూడా చేయించలేని స్థితిలో సిఎం ఉన్నారని విమర్శించారు. ఢిల్లీకి బ్యాగులు మోయడమే కాకుండా, రాష్ట్ర బాగోగులను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కెసిఆర్ మాత్రమే
రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు స్పందించటం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా.. డీపీఆర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. అత్యంత ముఖ్యమైన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళొద్దని చెప్పినా.. సిఎం రేవంత్ వెళ్ళటం వెనుక ఆంతర్యమేంటి..? అని నిలదీశారు. కేంద్రమంత్రి రాసిన లేఖ అబద్ధమా..? కర్ణాటక, మహారాష్ట్ర లేఖలు అబద్ధమా..? ని ప్రశ్నించారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23 వేల క్యూసెక్కులు మళ్లించేలా టెండర్ బిడ్ డాక్యుమెంట్‌లో రూపకల్పన చేశారని, దాని సామర్థం 11,500 క్యూసెక్కులు మాత్రమే అని పేర్కొన్నారు. ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నారని, ఈ అంశంలో కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, 11,500 క్యూసెక్కులకే అనుమతి ఉందని చెప్పారు. 23 వేలకు తవ్వుతుంటే కేంద్రం ఎందుకు ఆపడం లేదని అడిగారు.
నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతుంటే బిజెపి ఎందుకు నిధులు ఇస్తుంది..? అని ప్రశ్నించారు. కెనాల్ తవ్విన ఎపి తప్పు అయితే, సహకరించిన బిజెపిది కూడా తప్పే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కెసిఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా..? అని నిలదీశారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటే బిఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. కెసిఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని వెల్లడించారు. కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణకు ప్రయోజనాలు కాపాడుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాణం ఎపి ఎంపీల చేతులో ఉందని, బిఆర్‌ఎస్‌కు ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో కోట్లాడేవారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం అని హరీష్ రావు పేర్కొన్నారు.