న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అద్భుత బ్యాటింగ్‌తో మొదటి రోజే పైచేయి సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. రాహుల్, యశస్వి కుదురుగా ఆడడంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే 54 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు చేసిన రాహుల్‌ను వారికన్ వెనక్కి పంపాడు. దీంతో 58 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
జైస్వాల్, సాయి జోరు..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను యశస్వి, సాయి సుదర్శన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు యశస్వి, అటు సుదర్శన్ తమ మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ముందుకు సాగారు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న యశస్వి 145 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది యశస్వికి టెస్టుల్లో ఏడో సెంచరీ కావడం విశేషం. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ సెంచరీకి చేరువలో వచ్చి పెవిలియన్ చేరాడు. అద్భుత షాట్లతో అలరించిన సాయి 165 బంతుల్లో 12 ఫోర్లతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 13 పరుగుల తేడాతో సెంచరీని చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇదే సమయంలో యశస్వితో కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 193 పరుగులు జోడించాడు. సుదర్శన్ ఔటైనా జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. అతనికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. యశస్వి దూకుడుగా ఆడగా గిల్ రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి 253 బంతుల్లో 22 ఫోర్లతో 173 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 20 (బ్యాటింగ్) అండగా నిలిచాడు. కాగా, గిల్, యశస్విలు ఇప్పటికే మూడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ వారికన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలావుంటే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.