హైదరాబాద్: రిజర్వేషన్లు 50% దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని వివరించింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరుపుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హై కోర్టు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో బిసిలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 9 పై స్టే విధించింది. దీంతో బిసి రిజర్వేషన్లపెంపుపై నెల కొన్న ఉత్కంఠకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తాత్కాలికంగా తెరపడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, మెహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే నిలిచిపోయింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది రవివర్మ వర్చువల్‌గా తన వాదనలు వినిపించారు. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లపై ఎక్కడా సీలింగ్ లేదన్నారు. రిజర్వేషన్ల సీలింగ్ అనే పదానికి నిర్వచనం లేదని వివరించారు. కేవలం సుప్రీం కోర్టు తీర్పులు మాత్రమే ఉన్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే పిటిషనర్లకు ఎటువంటి ఆధారం లేదని, ఏ ఆధారంతో ఈ పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలన్నారు. రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే ఉందని, అందుకు స్పష్టమైన ఎటువంటి పునాది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిల మొత్తం జనాభా 85 శాతం జనాభాకు 67 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, మిగతా 15 శాతం జనాభాకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అలాంటప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తప్పేంటనీ రవివర్మ వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసి న జీఓను కొట్టివేయాలని మాదవ్ రెడ్డి, స ముద్రాల రమేష్ అనే వ్యక్తులు హైకోర్టు ను ఆశ్రయించిన విషయం విధతమే.