ఓస్లో: నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ సారి వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను ఈ బహుమతి వరించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతో ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ కాగా.. అకాడమీ సభ్యులు మరియాపైపు మొగ్గుచూపారు. వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు మరియాకు ఈ అవార్డు దక్కింది.
నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం మరియా శాంతి మార్గంలో అవిశ్రాంతంగా కృషి చేశారని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. మరియా వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా.. దేశ విపక్ష నేతగా పని చేశారు. తమ దేశం సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె.. శాంతి మార్గంలో ప్రజాస్వామ్య సాధన కోసం కృషి చేశారని.. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ పేర్కొంది.