ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని, దాని డొల్లతనాన్ని మరోసారి వెల్లడి చేసింది. సామ్రాజ్యవాదం ఒక పరాన్నభుక్కు. ఇతరులపై ఆధారపడి జీవించట మే దాని విధానం. అమెరికా సామ్రాజ్యవాదం ఇతర దేశాల సహజ వనరులను దౌర్జన్యంగా తరలించుకుపోయి బతుకుతున్నది. వెనుకబడిన దేశాలను బెదిరించడం, దాడులు చేయడం, దేశాల మధ్య యుద్ధాలు ప్రేరేపించి ఆయుధాలు అమ్ముకోవటం అమెరికా విధానం. కొల్లగొట్టిన విదేశీ వనరులను రక్షణ వ్యవస్థకు, ఆయుధ తయారీకి అత్యధికం ఖర్చు చేయడం వల్ల అది తరచూ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. నేడు అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం అందులో భాగమే. ఈ సంక్షోభ ఫలితంగా ఏర్పడిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత నుండి బయటపడేందుకు విదేశాలనుండి దిగుమతి అవుతున్న సరుకులపై ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు.
దిగుమతులపై విధించే సుంకాల వల్ల దేశానికి చాలా డబ్బులు వస్తాయని, దేశం మరింత ధనిక దేశంగా మారుతుందని ట్రంప్ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆచరణలో ట్రంప్ అనుకున్నట్లు జరగకపోగా, అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుంకాల పెంపుతో అమెరికా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి కూరుకు పోయింది. దేశంలోకి దిగుమతులు తగ్గిపోయి వస్తువుల కొరత ఏర్పడి వాటి ధరలు పెరిగాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కుటుంబ ఖర్చులు పెరిగాయి. ట్రంప్ వెడల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.
ట్రంప్ టారిఫ్ విధానాలపై అనేక మంది తీవ్ర విమర్శలు చేశారు. 2007లో దేశంలో ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసిన మొదటి ఎకనమిస్ట్ మార్క్ జండీ నేటి అమెరికా గురించి మాట్లాడుతూ.. ట్రంప్ టారిఫ్ ఒక చెత్త నిర్ణయమని తిట్టిపోశాడు. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 3 నుండి 4 శాతానికి చేరుకుంటుందని హెచ్చరిక చేశాడు. టారిఫ్‌ల పెంపుతో అమెరికా కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు రాబోయే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం 43 శాతం ఉందని ‘ఇస్ బ్యాంకు’ ఇటీవల నిర్వహించిన సర్వే హెచ్చరించింది. కొత్త సుంకాలు అమల్లోకి వస్తే, మాంద్యం ప్రమాదం 50% కన్నా ఎక్కువ ఉండవచ్చని జెపి మోర్గాన్ బ్రూస్ సాస్మాన్ సూచిస్తున్నాడు.
అమెరికా ప్రభుత్వానికి తాత్కాలిక నిధులు సమకూర్చే బిల్లును రిపబ్లికన్లు సెనేట్‌లో ప్రవేశపెట్టగా, దానికి డెమొక్రాట్లు మద్దతు ఇవ్వకపోవటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ ఖర్చుల గడువు 30 ఆగస్టు, -25 అర్ధరాత్రి ఉదయం 00.01 నిమిషంతో ముగియడం వల్ల సంక్షోభం తలెత్తింది. ఏడు వారాల పాటు ఫెడరల్ ఫండింగ్‌ను పొడిపించే బిల్లును సెనేట్ ఆమోదించపోతే, గత ఏడేళ్లలో అమెరికాలో ఇదే తొలి షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ అంటే, అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ ప్రభుత్వ ఏజన్సీలకు నిధులు కేటాయించేందుకు ఒక చట్టాన్ని ఆమోదించడంలో విఫలమైనప్పుడు, ఆ నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా అత్యవసరం గాని ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయి, తాత్కాలిక ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వస్తుంది. షట్ డౌన్ ఏర్పడితే దాదాపు 75 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది.
అమెరికా ప్రభుత్వ యంత్రాంగం చరిత్రలోనే ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా గత సెప్టెంబర్ 30 నుండి ఏకంగా లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులకు దూరమయ్యారు. 2025 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని అంచనాగా ఉంది. ట్రంప్ ప్రభుత్వం డిఫర్త్ రెసిగ్నేషన్ పోగ్రామ్ (డిఆర్‌పి)పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సెప్టెంబర్ నెల 30 వరకు ఎలాంటి పని చేయకుండానే పూర్తి జీతం పొందే అవకాశం కల్పిస్తూ రాజీనామాలను ప్రోత్సహిస్తున్నది. దీనికి తోడు కొత్త నియామకాలపై నిషేధం, అనవసరమైన ఉద్యోగుల తొలగింపు చర్యలు ప్రభుత్వం చేపట్టడంతో చాలా మంది ఉద్యోగులు ఒత్తిడికి లోనై ట్రంప్ పథకానికి అనుగుణంగా రాజీనామాల బాట పడుతున్నారు. గత జులైలో ఉద్యోగ గణాంకాలు తగ్గిపోవటం పట్ల సదరు డేటాను ఇచ్చిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి ఎల్‌ఎస్) డైరెక్టర్‌ను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ట్రంప్ విధానాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 8.1 తేడాతో ప్రభుత్వ చర్యను సుప్రీం కోర్టు ఆమోదించి ఉద్యోగుల తొలగింపును సమర్థించింది. షట్ డౌన్ ఏర్పడితే చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తామని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించాడు. ఆయన విధానాల ఫలితంగా అమెరికా ఉద్యోగ మార్కెట్ బలహీన పడింది. తయారీ వంటి కొన్ని రంగాలు కార్మికులను తొలగించటం ప్రారంభించాయి.
2024లో అమెరికా జిడిపి అభివృద్ధి రేటు 2.6% ఉండగా, 2025లో 1.6% తగ్గిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో- ఆపరేషన్ అండ్ డెవలఫ్‌మెంట్ (డిఇసిడి) అంచనాగా ఉంది. 4- సెప్టెంబర్, 25న అమెరికా కార్మిక శాఖ ప్రచురించిన డేటా ప్రకారం 2024 సెప్టెంబర్ ఆ దేశ ద్రవ్యోల్బణం 2.4% ఉండగా, 2025 ఆగస్టు నాటికి 2.9%కి చేరింది. జిడిపి తగ్గి, ద్రవ్యోల్బణం పెరగటం వల్ల ధరలు బాగా పెరిగి వినియోగదారులకు ఖర్చు పెరిగి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. నేడు అమెరికా అప్పు 37 లక్షల కోట్ల డాలర్లు. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం 2020లో 23.2 ట్రిలియన్ (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) డాలర్లుగా ఉంటే, గత ఐదు సంవత్సరాల్లో 17 ట్రిలియన్ల అప్పు పెరిగింది. ఈ సంవత్సరంలోనే 40 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల డాలర్లు అంటే 86 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు చెల్లిస్తోంది. ఈ వడ్డీ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనాగా ఉంది. అమెరికా పన్నుల ద్వారా సేకరించే డబ్బులో దాదాపు 25% వడ్డీలకే చెల్లిస్తోంది. 1900 సంవత్సరంలో ఈ వ్యయం జిడిపి 3.14% ఉంటే, 1950 నాటికి 13.83%, 2000 సంవత్సరం నాటికి 17.55%కి, 2025లో 23.87 కి చేరింది. దీన్ని గమనిస్తే అమెరికా అప్పులు ఏ స్థాయిలో ఉంది అర్థమవుతుంది.
అమెరికాలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. అమెరికా పాలకులు అప్పుల ద్వారా పాలన సాగిస్తున్నారు. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశ స్థూల ఉత్పత్తి (జిడిపి) తగ్గి, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ట్రంప్ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో సామాన్య కుటుంబాలపై అదనంగా ఆర్థిక భారం పడి ఇబ్బందులు పడుతున్నాయి. గత 12 సంవత్సరాల్లో కుటుంబాలు భవిష్యత్తు గురించి అత్యంత నిరాశావాదంలో ఉన్నాయి. ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచటం వల్ల సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఈ పరిస్థితుల నుండి ప్రజలు బయటపడాలంటే, సంపద వికేంద్రీకరణ జరగాలి. పాలకులు సామ్రాజ్యవాద విధానాలను విడిచిపెట్టాలి. ఆయుధ ఉత్పత్తికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలి. ఇందుకు అమెరికా ప్రజల ముందు ఉన్న ఏకైక మార్గం పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం వైపు పయనించటమే.
బొల్లిముంత సాంబశివరావు
9885983526