గాంధీనగర్: ఓలా స్కూటీ రిపేర్ విషయంలో కంపెనీ వాళ్లు సరిగా స్పందించలేదని వాహనాన్ని షోరూమ్ ముందు కస్టమర్ తగలబెట్టాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం పాలన్‌పూర్‌లో జరిగింది. సాహిల్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి ఓలా బైక్‌పై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఓలా బైక్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. స్కూటీని రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులను ఇతర వాహనంలో ఇంటికి పంపించాడు. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారు స్పందించలేదు. మరో వాహనంలో స్కూటీని షోరూమ్‌కు తీసుకెళ్లాడు. స్కూటీ రాడ్ విరిగిపోయిందని షోరూమ్ వాళ్లకు చెప్పాడు. షోరూమ్ నిర్వహకులు పట్టించుకోకపోవడంతో ఓలా బైక్‌కు నిప్పు పెట్టి నిరసన తెలియజేశాడు. ఓలా బైక్ రిపేర్‌కు వచ్చినప్పుడు కంపెనీ వారు పట్టించుకోవడంలేదని కస్టమర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.