రంగారెడ్డి: కళ్ల ఎదుటే కన్నతల్లి ఉరి వేసుకొని చనిపోతుంటే తనయుడు కాపాడలేకపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహ(46), సుధ(42) అనే దంపతలు 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వనస్థలిపురంలోని మారుతీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సింహ భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుధ ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 13 ఏళ్ల చిన్న కుమారుడు చిన్నప్పటి నుంచి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి వైద్యం చేయించలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 18 ఏళ్ల పెద్ద కుమారుడు పక్కింట్లో ఇనుప రాడ్ దొంగతనం చేయడంతో యజమాని వారిని మందలించాడు. భర్త మద్యానికి బానిసగా మారడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. భర్త ఇంట్లో లేని సమయంలో పెద్ద కుమారుడిని పెరుగు తీసుకరావాలని కిరాణం దుకాణానికి పంపింది. చిన్న కుమారుడు చూస్తుండగానే సీలింగ్ సుధ ఉరేసుకుంది. చిన్న కుమారుడు అనారోగ్యంతో కూడా ఆమె కాళ్లు పట్టుకొని కాపాడడానికి ప్రయత్నించాడు. అప్పటికే తల్లి గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది. స్థానికులు ఇంటి డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.