అమరావతి : రైతు సేవా కేంద్రాలను రీ- ఓరియంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో కీలకపాత్ర పోషించాలని అన్నారు. రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలని చెప్పారు. వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి పోషక విలువల ద్వారా భూసారం, ఉత్పాదకత పెంచాలని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రకృతి సేద్యం ద్వారా ప్రయోజనాలు రైతులకు వివరించాలని, క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తిస్థాయి అవగాహన ఉండేలా చూడాలని ఆదేశించారు. పోషకాల విషయంలో లోపాలను సవరించి ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.