మన తెలంగాణ/హైదరాబాద్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలు కోసం న్యాయపోరాటం చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో గురువారం సాయంత్రం మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కు మార్ గౌడ్‌లతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని హైకోర్టు చెప్పిందని, ఎన్నికలు జరపడానికి బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లను చిత్తశుద్దితో ఇవ్వడానికి ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. 2018లో బిఆర్‌ఎస్ ప్రభు త్వం రిజర్వేషన్ కటాఫ్ 50శాతం చేస్తూ చట్టం చేసిందని,
ఓబిసిలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈరోజు బిఆర్‌ఎస్, బిజెపి తమపై నిందలు వేస్తుందని, ప్రజలు అమాయకులు కాదని ఆయన అన్నారు. బిసి సంఘాల నాయకులు అంతకంటే అమాయకులు కాదని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్, బిజెపిలను క్షమించరని స్పష్టం చేశారు. ఎంపిరికల్ డాటా లేకుండా రిజర్వేషన్ ఎలా ఇస్తారని ఆనాడు కోర్టు చెప్పిందని, జిఓ9 ను తీసుకురావడానికి సిపెక్ సర్వే చేశామని, సైంటిఫిక్‌గా సర్వే చేసి వాటిని బిల్లు రూపంలోకి తెచ్చామని, ఎక్కడా పొరపాటు జరగకుండా సర్వే చేశామని ఆయన తెలిపారు.
రిజర్వేషన్‌ల కోసం న్యాయ స్థానాల్లో, రాజకీయంగా పోరాటం చేస్తాం
తాము సభలో చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని, తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బిజెపి బిల్లులు ఆపుతుందని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ 50 శాతం స్లాబ్ దాటకుండా చట్టం చేశారని, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు బిసిల నోటికాడి ముద్ద లాక్కున్నాయని, ఆ రెండు పార్టీలు కూడ బలుక్కొని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. వారా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేదని డిప్యూటీ సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మూడు నెలలుగా బిల్లుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అది చట్టంగా మారినట్టేనని అందుకే జిఓ ఇచ్చామని ఆయన తెలిపారు. సర్వేలో కూడా పాల్గొనని పార్టీలు ఈరోజు మాట్లాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు వారిని క్షమించరని ఆయన తెలిపారు. రిజర్వేషన్‌ల కోసం న్యాయ స్థానాల్లో, రాజకీయంగా పోరాటం చేస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం తాము ధర్నా చేసినప్పుడు బిఆర్‌ఎస్, బిజెపిలు ఎక్కడికి వెళ్లాయని, ఢిల్లీకి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
కోర్టు తీర్పు డాక్యుమెంట్ కాపీ వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ: పిసిసి అధ్యక్షుడు
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను నమ్ముతుందన్నారు. కచ్చితంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తామని ఆయన తెలిపారు. హైకోర్టులో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తీర్పు డాక్యుమెంట్ కాపీ వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు నోటికాడి ముద్దనులాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని అందులో భాగంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ కాబ్ లిమిట్ పెడుతూ చట్టం చేసిందని, అడుగడుగునా బిసిలను బిఆర్‌ఎస్ అణగదొక్కిందని ఆయన ఆరోపించారు.
బిసిలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే ద్రోహులుగా…
తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆదిశగా ముందుకు పోతున్నామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సిఎం, మంత్రులంగా ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామని, బిసి సంఘాలు, కుల సంఘాలు ధర్నా చేస్తే బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఎందుకు చేయలేదని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హైకోర్టు లో ఇంప్లీడ్ అయితే బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు ఏ ఒక్కరు ఆ కేసులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. బిసిలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తున్న ఆ పార్టీలు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన ఆరోపించారు.