విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23) పరుగులు చేశారు. హర్లిన్ డియోల్ (13) పరుగులు చేసి ఔటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9), రోడ్రిగ్స్ (0), దీప్తి శర్మ (4) నిరాశ పరిచారు. అయితే వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. చెలరేగి ఆడిన ఘోష్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. స్నేహ్ రాణా (33) ఆమెకు అండగా నిలిచింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ లౌరా వాల్‌వర్డ్ (70) జట్టుకు అండగా నిలిచింది. ఇక నడైన్ డి క్లార్క్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించి పెట్టింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన క్లార్క్ 54 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చోలె ట్రియాన్ (49) తనవంతు పాత్ర పోషించింది.