పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము (ఇండియా కూటమి) అధికారం లోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ హామీ ఇచ్చారు.
పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకు వస్తామని అన్నారు. “20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీయే ఉద్యోగాలు కల్పించలేక పోయింది. మేం అధికారం లోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలం లోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు ఐదేళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో మీరే ఊహించుకోవచ్చు” అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కాపీక్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని ఆరోపించారు.