‘ఓ పాలబుగ్గల జీతగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో’ అంటూ ఆ కన్నీటి వెతలను తడిమిందా కలం, పల్లెటూరి పిల్లవాని ఆర్ద్రత, ఆవేదనలను వినిపించిందా గళం ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పినా తీరదు కూలన్న’ అంటూ ప్రజల దీనగాథలు రాసిందా కలం. సామాజిక అసమానతలను ప్రశ్నించిందా గళం. ‘ఎత్తరుగులపై పెత్తందారులు అన్ని విధాలుగా దోచుకుని, అందలమెక్కిన మహానుభావులు’ అంటూ వ్యవస్థను నిలదీసిన కలం. జాగరతోయ్ జాగరత అంటూ జనానికి కర్తవ్య బోధన చేసిందా గళం. ‘నిజాంలో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రని జెండా ఎగరేస్తాం’ అంటూ నిజాం ప్రభువుపై పాటల తూటా గురిపెట్టిందా కలం. ప్రజా ప్రభుత్వం సాధిస్తామంటూ ఎలుగెత్తి చాటిందా గళం. ‘వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్’ అంటూ నిజాం సైన్యంపై తిరగబడిందా కలం. అచేతన వ్యవస్థను జాగృతపరచిందా గళం. ఆ కలం, గళం సమ్మేళనమే ప్రజాకవి సుద్దాల హనుమంతు. అర్థవంతమైన ఆవేశం, అవగాహనతో కూడిన పరిపక్వ ఆలోచనాభావాలు, సామాజిక స్పృహ అతని కవిత్వంలో పాల పొంగులా ఉప్పొంగుతూనే ఉంటాయి. ప్రజా ఆవేదనలను రాసి, పాడి, ఆడి వారిలో చైతన్యాన్ని నింపిన దివిటి సుద్దాల.
ఒక చేత పెన్ను మరో చేత గన్ను పట్టి నిజాం ముష్కరుల వెన్నులోవణుకు పుట్టించిన ధీరుడు. పాత నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో బుచ్చి రాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు సుద్దాల జన్మించాడు.వారికి ఆరుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. వారందరిలో చివరగా జన్మించిన హనుమంతు అసలు ఇంటి పేరు గుర్రం. జీవన పోరాటంలో ఆ కుటుంబం గుండాల మండలం సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఆ ఊరి పేరు ఆయన ఇంటిపేరుగా మారింది. చిన్నతనంలో చదువుకునే అవకాశాలు లేక వీధి బడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలోనే యక్షగానాలు, కీర్తనలు, భజనలు లాంటి కళారూపాలు అంటే ఆసక్తి మెండుగా ఉండేది. తన గ్రామంలో హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడిగా ఆయన బృందంలో చేరాడు. చిన్న వయసులోనే బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాద్ చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌గా పని చేశాడు. కానీ సమాజ చైతన్యం లక్ష్యంగా ఉన్న సుద్దాల స్వల్పకాలం మాత్రమే ఉద్యోగం చేసాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పని చేశాడు.
1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో స్వచ్ఛంద కార్యకర్తగా తన కార్యాచరణ మొదలు పెట్టాడు.ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో సంఘం స్థాపించాడు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనాయి. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాడని సుద్దాలపై నిజాం ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. కొంత కాలం తరువాత అనారోగ్య కారణంగా బయటకు వచ్చి బాల్యంలో తనకున్న సాంప్రదాయ హరికథలు జానపద గేయాలు సభలలో పాడి అందరి మన్ననలు పొందేవాడు. తన కలం, గళం కలగలిపి ప్రజలని ఉద్యమానికి కార్యోన్ముఖులను చేయడంలో సుద్దాల పాత్ర కీలకంగా మారింది. నిజాం దౌర్జన్యాలను పాటల రూపంలో వివరిస్తూ పల్లె పల్లెనా సమావేశాలు నిర్వహణకు సుద్దాల పాటలే ఆయువుపట్టయ్యాయి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకు వెళ్ళేది పాటే కాబట్టి పాటే పోరాటరూపం దాల్చేది. ఆ పాటల ప్రవాహానికి బలాన్ని బలగాన్ని సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘నీ బాంచన్ కాల్ మొక్కుతా’ అన్నవారితో బందూకులు పట్టించిన పాటలు ఆయనవి.
హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజుపట్టిన నిజాం నిరంకుశ పాలకుల దొరల, దేశ్‌ముఖ్‌ల కోట గోడలను కూల్చివేసిన జనగీతం సుద్దాల. వెట్టిచాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశాడు. ఇవన్నీ వీర తెలంగాణ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మగౌరవం, అలుపెరుగని వీరావేశం అతని పాటకు బలాన్ని సమకూర్చినవి. అంతేకాదు సుద్దాల బుర్రకథ చెపితే గడ్డిపోచ కూడా కరవాలంగా మారేదని నానుడి. అతని బుర్రకథ కోసం ప్రజలు ఎన్ని గంటలైనా ఎదురుచూసేవాళ్లంటే అతిశయోక్తికాదు. సమావేశంలో ఐదు గంటలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సుద్దాల నిర్వహించే వాడు. దీన్ని బట్టి అయన ఎంత గొప్ప కళాకారుడో మనం అర్ధం చేసుకోవచ్చు. గొల్లసుద్దులు, లత్కోర్‌సాబ్, బుడబుక్కలు, ఫకీర్ వేషం, సాధువు మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని భావాలని వ్యక్తీకరించాడు. తన కళారూపాలతో సభికులను విశేషంగా ఆకట్టుకునేవాడు. జానపద కళారూపాలకు జీవంపోసి అనేక పాటలను ప్రజలకు అందించాడు. కేన్సర్ వ్యాధితో 1982 అక్టోబర్ 10న సుద్దాల కలం గళం శాశ్వతంగా మూగపోయాయి.
ములక సురేష్ 94413 27666