అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎలాగైనా పొందాలన్న ఆకాంక్షతో చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ బహుమతిపై మాట్లాడుతూ అక్టోబర్ 10న తనకు నోబెల్ శాంతి బహుమతి రాకుంటే తమ దేశం అమెరికాకే ఘోర అవమానంగా ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో పలువురు నాయకులు, సంస్థలు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. 2020 లో బైడెన్ వారసురాలు కమలా హారిస్ అధ్యక్షురాలు అవుతుందని చెప్పినప్పుడు అది అమెరికాకే పెద్ద అవమానమని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఎందుకు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని కోరుతున్నారో విచిత్రంగా ఉంది. ఇంతవరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలంతా దానికి అనర్హులేనని, కేవలం సందేహాస్పద విధానాల ద్వారానే ఎంపికయ్యారన్న అపోహ ట్రంప్‌లో గూడుకట్టుకుంది. శాంతి అహింసలే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసినట్టయితే ఆయన ఆత్మ ఎంతో కృతజ్ఞత వెల్లడించేది.
కానీ ఆయనకు శాంతి బహుమతి రాలేదు. ఆ తరువాత కాలంలో హెన్రీ కిసింజర్‌కు, అంగసాన్ సూకీలకు నోబెల్ బహుమతి లభించింది. హెన్రీ కిసింజర్ వియత్నాం యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేలా చేయడంతో పాటు కాంబోడియా, లావోస్‌లలో బాంబుల దాడిలో ఆయన హస్తం పరోక్షంగా ఉంది. అంగ్‌సాన్ సూకీ తన సైనిక దళాలు రోహింగ్యాలను హింసించడాన్ని సమర్థించింది. ఒబామా గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి అద్దె చెల్లించకుండా నివాసంలో ఉంటున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అలాగే అమెరికా దేశాధ్యక్షుడుగా ఉన్న కాలంలో అంతకు ముందటి దేశాధ్యక్షుడు బుష్ సైనిక వాదాన్ని తిరస్కరించడానికి ప్రేరేపించాడు. అంతకు తప్ప మరేమీ చేయని ఒబామా 2009 లో పదవీ బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పుడు తాను అంతకుమించి ఎన్నో చేశానని తనకెందుకు రాకూడదని ట్రంప్ వాదిస్తున్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ పేరున జరిగిన యుద్ధంతోసహా ఏడు యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ట్రంప్ ఎంత మొత్తుకున్నా ఇజ్రాయెల్ దాడి గాజాపై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన దౌత్యం వల్లనే భారత్, పాకిస్థాన్ దేశాలకు వాణిజ్య ఒప్పందాల ఆశ చూపి యుద్ధాన్ని ఆపించానని ట్రంప్ పదేపదే చెప్పుకోవడాన్ని భారత ప్రధాని మోడీతోసహా భారతీయ దౌత్యవేత్తలు పలుసార్లు ఖండించడం జరిగింది.
భారత్ పాక్ ద్వైపాక్షిక నిర్ణయం తప్ప మూడో దేశం జోక్యం తాము అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం నోబెల్ బహుమతికి ట్రంప్ అర్హుడని సమర్థిస్తోంది. అబ్రహాం అకార్డ్ అనే ఒప్పందం ఇజ్రాయెల్, అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సుడాన్, మొరాకో వంటి అరబ్ దేశాల మధ్య జరిగింది. 1994లో జోర్డాన్‌తో ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒక అరబ్ దేశంతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఒప్పందం 2020 సెప్టెంబర్ 15న వాషింగ్టన్ డీసీ లోని వైట్‌హౌస్‌లో ట్రంప్ సమక్షంలో జరిగింది. ఇది మధ్యప్రాచ్యంలో శాంతికి కీలకమైన ఒప్పందంగా ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో జిమ్మీకార్టర్, బిల్ క్లింటన్ మాజీ అధ్యక్షులుగా పర్యటించిన తరువాత ట్రంప్ ఆ దేశంలో పర్యటించారు. రెండుసార్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమైనా అణు నిరాయుధీకరణ ప్రాంతంగా ఉత్తర కొరియాను చేయాలన్న లక్షం నెరవేరలేదు. కానీ శాంతి ప్రయత్నాలు చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతానన్న హామీతో అధికారం లోకి వచ్చిన ట్రంప్ మొదటి ఆరు నెలల్లోనే యుద్ధోన్మాదిగా మారారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా యుద్ధంగా మార్చేసిన ట్రంప్ ఇప్పుడు శాంతి సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకు వస్తున్నారు.
కొన్ని నెలల క్రితం అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్డర్ ట్రంప్ పేరును నోబెల్‌కు ప్రతిపాదిస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించింది. ఇప్పుడు నోబెల్ కమిటీ వామపక్ష, ఉదారవాదుల పట్ల సానుకూల ధోరణితో ఉంటున్నదని, తన లాంటి సంప్రదాయ, జాతీయవాదుల విషయంలో వ్యతిరేకంగా ఉంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన ప్రముఖులకే ఇంతవరకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్టు రష్యా జపాన్ యుద్ధం ముగింపునకు కృషి చేసినందుకు, 1919 లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆప్ నేషన్స్ స్థాపించినందుకు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2002 లో జిమ్మీకార్టర్ అంతర్జాతీయ వివాదాలకు శాంతియుత పరిష్కారాల కోసం కృషి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2009 లో ఒబామా అణు నిరాయుధీకరణకు అంతర్జాతీయ దౌత్యంలో కీలక పాత్ర వహించినందుకు నోబెల్ సాధ్యమైంది. వీరితోపాటు 2007 లో అమెరికా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అల్‌గోర్‌కు కూడా వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించినందుకు ఈ అవార్డు దక్కింది. వీరితోపాటు తాను కూడా అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలు, శాంతి స్థాపనకు ఎంతో కృషి చేశానని, అందుకే నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి నోబెల్ బహుమతి ఎవరిని వరిస్తుందో చూద్దాం.