న్యూయార్క్ : చైనా మహిళతో నడిపిన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన కారణంగా ఓ అమెరికా దౌత్యవేత్తపై వేటు పడింది. ఆ మహిళపై గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చైనీయులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడంపై యూఎస్ గతం లోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీన్ని ఉల్లంఘించిన కారణంగా దౌత్యవేత్త తొలగింపు జరిగినట్టు తెలుస్తోంది.
పిగోట్ ప్రకటన ప్రకారం … విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళతో దౌత్యవేత్త ప్రేమ వ్యవహారం నడిపి , ఆ విషయం దాచి పెట్టారని నిర్ధారణ అయిందన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి రూబియో నాయకత్వంలో తమ దేశ జాతీయ భద్రతను దెబ్బతీసే ఏ ఉద్యోగినీ వదిలిపెట్టబోమన్నారు. అయితే ఆ దౌత్యవేత్త పేరును అధికారులు బయటపెట్టకపోవడం గమనార్హం.