హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్సు భవన్ కు బిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. సామాన్యులపై భారం మోపేలా పెంచిన బస్ టికెట్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బస్సు భవన్ ఎదుట ధర్నాకు బిఆర్ఎస్ నాయకులు, ఎంఎల్ఎలు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గులాబీ దండు కదలిరానుంది. బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేస్తూ నగర నలుమూలల నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌కు చేరుకుంటారు. చలో బస్సు భవన్ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇద్దరు నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం 8.45కు మోహిదీపట్నంలో బస్సు ఎక్కి బస్సు భవన్ కు చేరుకోవాలి, కెటిఆర్ సికింద్రాబాద్ నుంచి బస్సులో ప్రయాణం చేసి ఆర్ టిసి క్రాస్ రోడ్డు చేరుకోవాలి.