ముంబై : ప్రపంచ అనిశ్చితత నడుమ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం, మిత్రత్వం సుస్థిరతకు కీలక మైలురాయి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో విస్తృత చర్చలు తరువాత ప్రధాని మోడీ గురువారం ఈ బం ధంపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆర్థిక ప్రగతి, పురోగమనానికి ఇరుదేశాల మిత్రత్వం ప్రాతిపదిక అవుతోందని తెలిపారు. ఒక్కరోజు క్రితం అత్యంత భారీ , ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కీర్ స్టార్మర్ భారత్‌కు వచ్చారు. మొ దటిరోజు ఈ వాణిజ్య రాజధానిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర సహకారం దిశలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ కూడా ఇక్కడికి చేరుకున్న దశలో
ఇరువురు నడుమ సుదీర్ఘ చర్చలు బృందాల వారిగా, నేరుగా జరిగాయి.భారత్‌కు రక్షణ రంగ పటిష్టతకు సంబంధించి బ్రిటన్ నుంచి తేలికపాటి , బహుళార్థక క్షిపణి వ్యవస్థల (ఎల్‌ఎంఎం) సరఫరాకు ఒప్పందం కుదరింది. భారతీయ వాయుసేన పాటవశక్తిని పెంపొందింపచేసుకునేందుకు ఈ మిస్సైల్ వ్యవస్థలు ఎంతగానో ఉపకరిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక అత్యంత కీలకమైన రీతిలో సముద్ర మార్గాల నిశిత పర్యవేక్షణ తద్వారా భారతీయ నౌకాశ్రయ వేదికలకు ఎలక్ట్రానిక్ ప్రపుల్సన్ సిస్టమ్స్ సమకూర్చే విషయంలో కూడా ఇరుదేశాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. దీనితో భారతీయ విస్తారిత తీర ప్రాంతానికి రక్షణ కవచం పటిష్టం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులో భాగంగానే తీర ప్రాంత పర్యవేక్షణ వ్యవస్థలను నెలకొల్పుతారు.
జులైలో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదరడం స్నేహబందానికి పరాకాష్ట అని ఇరుదేశాల నేతలు వ్యాఖ్యానించారు. సంబంధాల మరింత వృద్ధి, వ్యాపార పురోగతికి ఈ ట్రేడ్ డీల్ దోహదం చేస్తుందని తెలిపారు. బ్రిటన్ ప్రధాని వెంబడి పలు సంస్థలు, పరిశ్రమలకు చెందిన అధినేతలు, కార్యానిర్వాహక అధికారులు, పలువురు విసిలతో కూడిన వంద మందితో కూడిన బృందం రావడం విశేష పరిణామం అయింది. ఇరుదేశాలు సహజసిద్ధ భాగస్వామ్యపక్షాలు. ప్రజాస్వామ్యం , స్వేచ్ఛ, చట్టపరమైన పాలన నిబిడీకృతంగా ఈ బంధం సాగుతుందని స్టార్మర్ సమక్షంలో మోడీ తెలిపారు. భారతదేశపు దక్షత, బ్రిటన్ నైపుణ్యత కలబోతగా సంతరించుకున్న విశిష్ట సమన్వయం అత్యంత కీలకమైనదని తెలిపారు. ఇరుదేశాల మధ్య అత్యంత కీలకం, వ్యూహాత్మకం అయిన వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం విశేష పరిణామమనే వాదనతో స్టార్మర్ ఏకీభవించారు. ఈ సందర్భంగానే ఆయన భారతదేశం ఆర్థిక పురోగతి గణనీయం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను మరోసారి ప్రధాని మోడీ నాయకత్వ పటిమను అభినందిస్తున్నానని తెలిపారు.
వచ్చే మూడేండ్లలోనే భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తి కానుందని ఇది నాయకత్వ లక్షణాలతోనే సాధ్యం అన్నారు. వాణిజ్య ఒప్పందం మరింత సమగ్రరీతిలో అమలు అయ్యేందుకు ఏర్పాటు అయిన సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటి (జెట్కో) వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయని ఇరువురు నేతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులు, విస్తృత స్థాయిలో వాణిజ్య విస్తరణకు అవసరం అయిన దిశలో కమిటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితి, రష్యా ఉక్రెయిన్ ఘర్షణ ఇతర ప్రపంచ సమస్యల గురించి కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరువురు ప్రధానుల భేటీకి ముంబైలోని రాజ్‌భవన్ వేదిక అయింది. ఇక్కడికి వచ్చిన ప్రధాని కీర్‌కు మోడీ సాదరస్వాగతం పలికారు. ఆ తరువాత ఇరువురు నేతలు సముద్ర తీరంలో ఓ వేదిక వద్ద నిలబడి ఏకాంత చర్చలు జరిపినప్పటి దృశ్యాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించారు. ఇద్దరూ ఏదో కీలక విషయంపై సీరియస్‌గా మాట్లాడుకుంటున్నప్పటి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
* ఉగ్రవాదంపై పోరులో సమిష్టివిధానాలు అవసరం అని భారత్ , బ్రిటన్ ప్రధానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బ్రిటన్‌లో ఖలీస్థానీయుల చర్యలకు సకాలంలో అడ్డుకట్ట వేయాల్సి ఉందని సూచించారు.
* భారత్‌లో బ్రిటన్‌కు చెందిన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో తొమ్మిది క్యాంపస్‌ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే ఈ దిశలో గురుగ్రామ్ క్యాంపస్‌లో విద్యా సంవత్సరం ఆరంభమైందని వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన పలు వర్శిటీల విసీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ విద్యారంగంలో పరస్పర సహకారానికి మరింత మార్గం ఏర్పడుతుందని మోడీ తెలిపారు.