హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఆర్‌టిసి పూర్తిగా నిర్వీర్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మహాలక్ష్మి డబ్బులు ఆర్‌టిసికి ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్సు భవన్ కు బిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మెహదీపట్నం నుంచి బస్సులో బస్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్‌టిసి కార్మికులకు సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించడంలేదని, ఆర్‌టిసి లాభాల్లో ఉంటే ఎందుకు కొత్త బస్సులు కొనడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. ఆర్‌టిసి ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని, మియాపూర్, ఉప్పల్ వర్క్‌షాపులను అమ్మకానికి పెట్టారని, ఆర్‌టిసి కార్గోను తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఆర్‌టిసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్‌టిసి ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్‌టిసి కార్మికుల పొట్ట కొట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు రైతిఫైల్ బస్టాండ్ నుంచి బస్ భవన్‌కు చేరుకున్నారు. బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ ఆర్‌టిసి ఎండికి నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.