బస్ ఛార్జీలకు నిరసనగా బిఆర్‌ఎస్ చేపట్టిన బస్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బిఆర్‌ఎస్ నాయకులు ముట్టుడికి బయలుదేరకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నాయకులు కేటిఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర నాయకులను హౌస్ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా నగరంలో ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం తెలియడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్లుపైకి వచ్చి నిరసన తెలిపారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు బస్‌భవన్‌కు ముట్టుడికి బయలుదేరడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హరీష్ రావును కోకాపేటలో, కేటిఆర్‌ను రాయదుర్గం, సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద గృహ నిర్భందం చేశారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ను రాజేంద్రనగర్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తర్వాత పోలీసులు వారిని బస్‌భవన్‌కు అనుమతించడంతో బిఆర్‌ఎస్ నాయకులు బస్‌లో బస్‌భవన్‌కు బయలుదేరారు. రేతిబౌలి బస్టాండ్ నుంచి ఎమ్మెల్యేలు బస్సులో ఆర్‌టిసి బస్‌భవకు వెళ్లి ఎండి నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
నాయకుల ఇంటి వద్ద భారీ బందోబస్తు…
బిఆర్‌ఎస్ నాయకులు బస్‌భవన్‌ను ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిఆర్‌ఎస్ నాయకుల ఇంటి వద్ద మంగళవారం రాత్రి నుంచి నిఘా పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఇంటి నుంచి బస్‌భవన్ ముట్టడికి బయటికి రాకుండా ఉండేందుకు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటికి వచ్చేందుకు ప్రయత్నించి నాయకులను ఇంట్లోనే గృహ నిర్భందం చేశారు.