విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపే లక్షంగా పెట్టుకుంది. విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఈ పోరు జరుగనుంది. సాగర తీర నగరంలో జరిగే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంత కాలంగా టీమిండియా మహిళా టీమ్ వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో రెండు విజయాలతో సత్తా చాటింది. సౌతాఫ్రికాపై కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఓపెనర్లు ప్రతిక రావల్, స్మృతి మంధాన జోరుమీదున్నారు. హర్లిన్ డియోల్ కూడా బాగానే ఆడుతోంది.
అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతోంది. మంధాన కూడా ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. మంధాన, హర్మన్‌లతో పాటు జెమీమా రోడ్రిగ్స్ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. దీప్తి శర్మ, స్నేహ్ రాణాలు ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్‌తో అలరించింది. కాగా, పాకిస్థాన్, లంకలతో పోల్చితే సౌతాఫ్రికా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో భారత్ ఏమాత్రం నిర్లక్షం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం మరింత సానుకూల అంశంగా చెప్పాలి.
విజయంపై కన్ను..
మరోవైపు సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. పటిష్టమైన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగుర వేయడంతో సఫారీ టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఓపెనర్ తజ్మిన్ బ్రిస్ట్ కివీస్‌పై కళ్లు చెదిరే శతకం సాధించింది. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారింది. సూనె లూస్ కూడా జోరుమీదుంది. న్యూజిలాండ్ పోరులో అజేయంగా 83 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. కెప్టెన్ లౌరా వల్‌వర్డ్ కూడా ఫామ్‌ను అందుకుంటే సౌతాఫ్రికాకు భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లోనూ సౌతాఫ్రికా బాగానే ఉంది. ఖాకా, క్లాస్, క్లర్క్, మిలాబా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సౌతాఫ్రికాను తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. రెండు జట్లు కూడా బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.