భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది చెప్పువిసిరిన వార్త నన్ను చాలా కలచి వేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారడానికి అనుమతించినందుకు మొత్తం న్యాయ వ్యవస్థ, సమాజం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌కి క్షమాపణ చెప్పాలి. జస్టిస్ గవాయ్ గౌరవాన్ని, ఆయన నిర్వహిస్తున్న అత్యున్నత పదవిపట్ల గౌరవాన్ని కాపాడడం మన నైతిక, రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇది భారత సుప్రీం కోర్టు గౌరవానికి సంబంధించిన విషయం. రాజ్యాంగం ఆర్టికల్ 17, ఆర్టికల్ 24 హక్కులను, వాటి అనుబంధ అంశాలను పరిరక్షించేందుకు సృష్టించబడిన సంస్థ సుప్రీం కోర్టు. ఈ రోజు జరిగినది రాజ్యాంగం పట్ల అపచారమే.
జస్టిస్ గవాయ్ ఆ అవమానాన్ని ఎంతో హుందాగా, ప్రశాంతంగా వ్యవహరించడం, అత్యున్నత ప్రమాణాల గౌరవాన్ని ప్రదర్శించడం నిజంగా గర్వకారణం. అయినా ఇది ఎలా జరిగిందని ప్రజల ప్రశ్నలను మనం తప్పించుకోగలమా? భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, ఈ రోజు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిపై చెప్పువిసిరిన న్యాయవాది చేసిన ఖండించదగిన వ్యాఖ్యల మధ్య నేను ఓ పోలిక చూపకుండా ఉండలేకపోతున్నాను. ఇద్దరూ సంకుచిత మనస్తత్వం కలవారే. తమకు తాము గిరిగీసుకున్న నారే. ఇద్దరు మాట్లాడే భాష ఒక్కటే. బాబ్రీ మసీదుపై తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా, నాలుగైదు శతాబ్దాల క్రితం బాబ్రీ మసీదు నిర్మాణంలో జరిగిన అపవిత్రతతో కూడిన ప్రాథమిక చర్య గురించి చంద్రచూడ్ మాట్లాడడం మరీ దారుణం.
కాగా, ఇప్పుడు ఈ న్యాయవాది అదే నీచాతినీచమైన భాషలో సనాతన్ ధర్మ్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్తాన్ అని నినదిస్తూ, కోర్టు విచారణలో ఉండగా బహిరంగ కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి పై చెప్పు విసిరాడు. ప్రధాన న్యాయమూర్తి దళితుడు కావడం, అవమానం పాలు కావడం యాదృచ్ఛికం కాదు. ఆర్టికల్ 17 చదివినప్పుడు ఈ అవమానం పూర్తిగా భిన్నమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. చంద్రచూడ్, ఆయన భాషలోనే సాగుతున్న న్యాయవాది మాట్లాడుతున్న హిందుస్తాన్ ఏదీ? ఎక్కడ? మనం ఎంతగా పతనమయ్యాం! ఎంత దారుణంగా దారి తప్పాం! మనం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, బంధుత్వాలు, గౌరవం, విజయాలను ఈ పతనం ముంచెత్తకుండా నివారించలేని శక్తిహీనులం ఎందుకు అయ్యాం? పోలీసులు ఆ వ్యక్తిని తీసుకువెళ్లి దర్యాప్తు చేయడం తప్ప ఏమి చేయగలరు? అయినా ఏం దర్యాప్తు చేస్తారు? ఏమి కనిపెడతారు? వారు ఏం చర్య తీసుకుంటారు? ఈ కుళ్లు ప్రజా చైతన్యంలోకి చొచ్చుకు పోతోంది.
ఈ దుర్మార్గాన్ని ఓడించేందుకు మనకు సంయమనం, ప్రతిఘటనతో కూడిన ఉప్పెన అవసరం. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఇలా అన్నారు. ‘రాజ్యాంగం పూర్తిగా ఆచరణీయమైనదని నేను భావిస్తున్నాను. ఇది సరళమైనది, శాంతిలోనూ, యుద్ధంలోనూ దేశాన్ని కలిపి ఉంచగలిగినంత దృఢమైనది. నిజానికి కొత్త రాజ్యాంగం కింద తప్పు జరిగితే, కారణం మనకు చెడ్డ రాజ్యాంగం ఉందని కాదు. మనం చెప్పాల్సింది ఏమిటంటే, మనిషి దుష్టుడు అనే’. రాజ్యాంగాన్ని ఆచరణీయమైనది, సరళమైనది, దుర్మార్గాన్ని నిరోధించేంత బలమైనదిగా మార్చే జ్ఞాపకాలను మనం ఎలా, ఏ ప్రాతిపదికన ఏకం చేయగలం ఒక చోట చేర్చగలం. ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగం పట్ల జరిగిన ఈ దుష్టత్వ చర్య దేశాన్ని కలిపి ఉంచడానికి అవసరమైన మార్గాలను ఎలా వెలిగిస్తుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రమాదంలో పడిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఏకమై జస్టిస్ బిఆర్ గవాయ్ మద్దతుగా నిలవాలి.
కల్పన కన్నబిరాన్