పాట్నా: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్ బంధన్ కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థానీ అవామ్ మోర్చా 15 సీట్లు డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. “మాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే , గౌరవప్రదమైన సీట్లు కావాలి. మేం 15 సీట్లు డిమాండ్ చేస్తున్నాం. ఆ సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోం. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతాం. నేనేమీ ముఖ్యమంత్రిని కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీకి గుర్తింపు కావాలని మాత్రమే ఆరాటపడుతున్నాం” అని జీతన్ రామ్ అన్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆయన బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం.
ఎన్డీయే కూటమిలో జేడీయూ, బీజేపీ, జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా, చిరాగ్ పాసవాన్ ఆధ్వర్యం లోని లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) , ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వం లోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ భాగం. హెచ్‌ఎఎంకు ఏడు ఆర్‌ఎల్‌ఎంకు ఆరు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కూటమిలో కీలక పార్టీలైన జేడీయు, బాజాపా సమానంగా సీట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చెరో 100 స్థానాల్లో పోటీ చేయొచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నవంబరు 6, 11 తేదీల్లో రెండు విడతలుగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14న ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22 తో ముగియనుంది.