ముంబై: టీం ఇండియాలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు యువ క్రికెటర్ పృథ్వీషా. అయితే ఎక్కడో ఓ దగ్గర తప్పులు చేసి వివాదంలో చిక్కుకుంటున్నాడు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల నుంచి పుంజుకుంటూ.. పలు మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. కానీ, తాజాగా అతడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల మహారాష్ట్ర తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తాజాగా రంజీ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌లో తన పాత జట్టు ముంబైపై చెలరేగిపోయాడు. 220 బంతులు ఎదురుకొని 181 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు పృథ్వీ 305 పరుగులు జోడించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో పృథ్వీ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఔట్ చేసిన ఆనందంలో ముషీర్.. పృథ్వీకి వీడ్కోలు పలికాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న పృథ్వీ ముషీర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతడి కాలర్ పట్టుకొని బ్యాట్‌తో కొట్టబోయాడు. వెంటనే అంపైర్ కలగజేసుకొని పృథ్వీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.