మాక్‌కె: భారత్, ఆస్ట్రేలియా అండర్19 జట్ల మధ్య జరుగుతున్న యూత్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో బౌలర్లు హవా నడిపించారు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11), కెప్టెన్ ఆయూష్ మాత్రె (4) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఇద్దరు తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా నిరాశ పరిచాడు. వైభవ్ 20 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రాహుల్ కుమార్ (9), వికెట్ కీపర్ హర్‌వంశీ పంగాలియా (1) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. మరోవైపు వేదాంత్ త్రివేది 4 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ (26) పరుగులు చేసి ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22), దిపేశ్ దేవేంద్రం (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బార్టన్ మూడు, విల్ బ్రియామ్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (66) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో కెప్టెన్ విల్ (10), యశ్ దేశ్‌ముఖ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఉద్ధవ్ మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
పాకిస్థాన్ మహిళలకు సవాల్..
నేడు ఆస్ట్రేలియాతో పోరు
కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే పోరు పాకిస్థాన్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌తో పోరు పాక్‌కు సవాల్‌గా తయారైంది. ఇక ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ పడకుండానే రద్దయ్యింది. కాగా, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కివీస్‌తో జరిగినపోరులో అష్లే గార్డ్‌నర్ కళ్లు చెదిరే శతకం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు అలీ హీలీ, లిచ్‌ఫీల్డ్‌లతో పాటు ఎలిసె పేరి, బెథ్ మూని, సదర్లాండ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులోఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్న పాక్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హీలీ, ఎలిసె పేరి, బెథ్‌మూని జట్టుకు కీలకంగా మారారు. అంతేగాక సెంచరీ స్టార్ గార్డ్‌నర్‌పై కూడా జట్టుకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పాకిస్థాన్ ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. బంత్లా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. బౌలర్లు బాగానే రాణించినా బ్యాటింగ్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కీలక బ్యాటర్లు విఫలం కావడం పాక్‌కు ప్రతికూలంగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్థాన్ పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.