కాలానుగుణంగా మార్పులు చేసుకుంటేనే ఎంతటి పేరున్న సంస్థ అయినా మనుగడ సాధ్యం. అలా కాకుండా కేవలం మూస ధోరణికే పరిమితమై అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే అది ఎంత పేరొందిన సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మనుగడలో లేని ఎన్నో సంస్థలు మనకు విదితమే. ఒకప్పుడు కెమెరా, ఫోటోగ్రఫీ రంగాలను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కోడాక్ కంపెనీ, మొబైల్ రంగం ప్రారంభంలో మనదేశంలో అత్యధిక వాటా కలిగిన నోకియా కాలనుగుణంగా వచ్చిన సాంకేతిక మార్పులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవ్వక తమ ప్రభావాన్ని కోల్పోయి దాదాపుగా కనుమరుగయ్యాయి. ఇక అదే కోవలో హెచ్‌ఎంటి, గోద్రేజ్, ఆల్విన్ ఇలా ఎన్నో కంపెనీలు తమ ఉనికిని కోల్పోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే ఏ సంస్థ అయినా దీర్ఘకాలం రాణిస్తూ అందులో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, లాభాల ఆర్జన సాధ్యపడుతుంది. బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకే పరిమితం కాకుండా దీర్ఘకాలం మనగడే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రంగాల వైపు దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతర రాష్ట్రాలతో పాటు ‘సింగరేణి గ్లోబల్’ నినాదంతో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. సోలార్, విండ్, జియో, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలతోపాటు లేటెస్ట్‌గా బంగారు, రాగి గనుల అన్వేషణ, కీలక ఖనిజ రంగాల్లో ప్రవేశానికి వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.
136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో అనేక ఆటుపోట్లలు ఎదుర్కొని రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా లాభాల్లో కొనసాగుతున్నది సిరులవేణి సింగరేణి. సంస్థ ప్రారంభం నాటి నుంచి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి కేంద్ర, – రాష్ట్ర ప్రభువత్వాలకు పన్నులు, డివిడెంట్లు, రాయల్టీల రూపకంగా ఆదాయాన్ని సమకూరుస్తూ దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాంత్రీకరణను సద్వినియోగపరుచుకుంటూ నేటికీ ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణ కొంగు బంగారంగా నిలుస్తుంది సింగరేణి. 1990 దశకంలో సింగరేణి మనగడే కష్టంగా మారి రెండు సార్లు దాదాపుగా సంస్థ మూసివేత పరిస్థితిలు నెలకొన్నాయి. నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సంస్థకు 1000 కోట్ల రుణసాయం చెయ్యగా.. ఉద్యోగులు, అధికారులు సమష్టి కృషితో సింగరేణిని కాపాడుకోవటమే ఏకైక లక్ష్యంగా చెమటోడ్చి అనతికాలంలోనే అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించి సింగరేణిని లాభాల్లో బాట పట్టించారు. 136 ఏళ్ల క్రితం బొగ్గు ఉత్పత్తి సంస్థగా ప్రారంభమైన సింగరేణి విద్యుత్ తయారీ రంగంలో 90% థర్మల్ విద్యుత్ తయారీకి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తూ లాభాలను ఆర్జించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే కాకుండా వివిధ వస్తు తయారీ రంగ పరిశ్రమలకు అవసరమైన బొగ్గు సరఫరాకు ఏకైక సంస్థ సింగరేణి కావడంతో గతంలో సంస్థ వైభవం కొనసాగింది.
ఆర్థిక సంస్కరణలు కారణంగా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేట్ సంస్థలు ప్రవేశంతో పాటు విదేశాల నుండి బొగ్గు దిగుమతి సింగరేణికి గట్టి పోటీగా మారింది. వాటికి తోడు సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ ధర కూడా ఎక్కువ కావడంతో ప్రైవేట్ సంస్థల బొగ్గు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గు ధర తక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు అటు వైపు మొగ్గు చూపటంతో సింగరేణి బొగ్గకు డిమాండ్ తగ్గింది.దీనికి తోడు గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికే దక్కేవి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ కారణంగా సింగరేణి సంస్థ సర్వే చేసి గుర్తించి నేరుగా దక్కించుకోవాల్సిన బొగ్గు గనులను సైతం ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీపడి వేలంలో సింగరేణి సంస్థ దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ రంగ సంస్థగా నాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థ వేలం ప్రక్రియలో పాల్గొనకపోవటంతో రెండు అతి పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రైవేటు కంపెనీలు దక్కించుకోవటంతో సింగరేణి వేల కోట్లల్లో ఆదాయాన్ని కోల్పోయింది.
ఒకవైపు సింగరేణికి ఉన్న బొగ్గు నిక్షేపాలు కరిగిపోవడం కొత్తగా బొగ్గు నిక్షేపాలు నేరుగా కేటాయించే పరిస్థితి లేకపోవడం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా థర్మల్ విద్యుత్ తయారీ విధానానికి స్వస్తి పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో ఉద్యోగుల భవిష్యత్తు, సంస్థ మనుగడను, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాక సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఇప్పటికే దృష్టి సారించింది. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటులో అడుగులువేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన సింగరేణి సంస్థ తన వ్యాపార పరిధిని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది.
ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడమేకాక సంస్థ వార్షిక లక్ష్య సాధనలో నైనీ బ్లాక్ క్రియాశీలపాత్ర పోషిస్తుంది. గత ప్రభుత్వంలోనే నైనీ బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థ దక్కించుకున్నా బొగ్గు ఉత్పత్తి మాత్రం జరగలేదు. రాష్టప్రభుత్వ సంపూర్ణ సహకారంతో కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో పలుమార్లు చర్చలు జరిపి ఎట్టకేలకు నైనీలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాల్లోనూ థర్మల్, సోలార్, బొగ్గు ఉత్పతి, ఇతర ఖనిజాల అన్వేషణ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇటీవల వేలంలో కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారు, రాగి గనుల అన్వేషణ లైసెన్సును దక్కించుకుంది. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇటీవల జరిగిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది. దీని ద్వారా ఆ ప్రాంతంలో బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణ అనంతరం అక్కడ జరిగే బంగారం, రాగి ఉత్పత్తిలో రాష్ట్రప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో సింగరేణి సంస్థకు 37.75% దక్కనుంది. ఆ ప్రాంతంలో ఎవరు ఆ గనులను చేపట్టినా సరే ఆ గనుల పూర్తి కాలం వరకు 37.75 రాయల్టీ సింగరేణి సంస్థకు దక్కనుంది.
ఇది ఆర్థికంగా సింగరేణి సంస్థకు ఎంతో తోడ్పాటునందించనుంది. ఇప్పటికే కీలక ఖనిజ రంగాల్లోకి ప్రవేశానికి సిద్ధమవుతున్న సింగరేణి సంస్థ సైతం వేలంలో ఈ బంగారు, రాగి గనుల మైనింగ్ సైతం దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే గనక జరిగితే సింగరేణి సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.సుదీర్ఘ మైనింగ్ రంగంలో బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి నల్లబంగారంగా ప్రాచుర్యం కలిగింది. కానీ ఇప్పుడు సంస్థ మనుగడే లక్ష్యంగా ఏకంగా బొగ్గు గనుల సర్వే లైసెన్స్‌లో బంగారు గనుల అన్వేషణ అవసరమైతే బంగారు గనుల నిర్వహణ రంగంలోకి ప్రవేశానికి ఏర్పాట్ల ద్వారా బంగారు గని సింగరేణిగా అందరి మన్ననలు పొందుతున్నది. సంస్థ మనుగుడ, కార్మికుల ఉద్యోగ భద్రతే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రంగాల అన్వేషణలో భాగంగా కీలక ఖనిజ రంగాల్లో ప్రవేశానికి సింగరేణి సిద్ధంగా ఉంది. కీలక ఖనిజ రంగం అభివృద్ధి కోసం కేంద్రం 32 వేల కోట్లు కేటాయించగా వాటిని సద్వినియోగ పరుచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కీలక ఖనిజ రంగంలో ప్రవేశం కోసం ఇప్పటికే రెండు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకొని అధ్యయనం జరుపుతున్నది. విదేశీ సంస్థల సహకారంతో అవసరమైతే విదేశాల్లో సైతం మైనింగ్, ఇతర రంగాల ప్రవేశానికి కృషి చేస్తూ బంగారు గని..గ్లోబల్ సింగరేణి నినాదంతో ముందుకు సాగుతున్నాది.
ప్రదీప్ రావు 99660 89696