స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తను నటించిన హారర్ కామెడీ చిత్రం ‘థామ’ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. మరోవైపు రష్మిక ఓ వివాదంలో చిక్కుకుంది. ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు.
ఇటీవల విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రంపై రష్మిక స్పందించకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమా అయినా.. విడుదలైన రెండు, మూడు రోజుల్లో నేను చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజులకి చూశాను. చిత్ర బృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశాను. వాళ్ల నాకు ధన్యవాదాలు తెలిపారు. తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేము కదా. ఇక నాకు ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడుతారు అనేదే నాకు ముఖ్యం.. దాన్ని మాత్రమే నేను పరిగణనలోకి తీసుకుంటాన’’ అని చెప్పింది.
ఇక కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వస్తున్న వార్తపై కూడా రష్మిక రియాక్ట్ అయింది. ఇప్పటివరకూ తనను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు అని తెలిపింది. ఇతరుల కోసం జీవించవద్దని.. ఇలాంటి రూమర్స్ అన్నీ అపార్థం వల్ల పుట్టుకొస్తాయని పేర్కొంది.