బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల జాబితా కొన్ని వర్గాల్లో ఉపశమనం కలిగించినా, మరి కొన్ని వర్గాల్లో తీవ్ర అశాంతి రేకెత్తించింది. గత మంగళవారం విడుదలైన తుది జాబితా, సామూహికంగా ఓటర్ల తొలగింపు భయాలు మొదట్లో భయపడిన స్థాయిలో లేకపోయినా, ఈ ప్రక్రియ దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్య భవిష్యత్ గురించి అత్యవసర ప్రశ్నలను లేవనెత్తింది. సుప్రీం కోర్టు జోక్యం ఎన్నికల కమిషన్ ను మరింత పారదర్శకత వైపు నడిపించగా, ప్రతిపక్షాలు అప్రమత్తమైన పాత్ర పోషించడంతో బీహార్ సర్ దారుణ ఫలితాలను తప్పించింది. కానీ ఈ కసరత్తు ఎన్నికల ప్రక్రియలను ఎలా ఆయుధంగా ఉపయోగించవచ్చో, భారతదేశం అంతటా ఇలాంటి సవరణలు చేపట్టే ముందు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంలో ఓ హెచ్చరిక కథగా మిగిలిపోయింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు సంఖ్యాపరంగా మాత్రమే ప్రమాదంలో పడలేదు. భారత ప్రజాస్వామ్య సమగ్రతే ప్రమాదంలోపడింది.ఓటర్ల జాబితా సవరణలో తలెత్తిన సమస్యలు, జాతీయ స్థాయిలో పునరావృతమైతే, సార్వత్రిక ఓటు హక్కు అనే అంశాన్నే అస్థిరతలో నెట్టివేయవచ్చు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలసదారులు, పేదలను లక్ష్యంగా చేసుకుంటూ పాలక వర్గాల పట్టును మరింత బలోపేతం చేస్తుంది.
బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాలను సంస్కరించడం, చనిపోయిన వారి పేర్లు, వలసపోయిన వారి పేర్లు, నకిలీ పేర్లను తొలగించే లక్ష్యం తో చేపట్టింది.అయినా రాజకీయం లోపాయికారిగా అంతర్గతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ శక్తులు ఈ కసరత్తును అక్రమ వలసదారులు, చొరబాటుదారులు -ఘుస్పైటియాస్ – తొలగించే మార్గంగా చూపాయి. కానీ ఈ పదాలు ముఖ్యంగా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యం చేసుకునే ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. మొదట్లో ఈ ప్రక్రియతో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు దారితీస్తుందనే భయాలు ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితాలో జూన్ నాటికి 7 కోట్ల 89 లక్షల మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్‌లో ప్రచురించిన తుది జాబితాలో 7 కోట్ల 42 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు 6 శాతం మందిని తొలగించారు. చనిపోయిన వారి పేర్లను, వలసదారులు, నకిలీల పేర్లు తొలగించామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, 68.6 లక్షల మంది పేర్ల తొలగింపు ఆశ్చర్యాన్ని కలిగించింది. తీవ్ర పరిణామాలకు దారితీసింది. మెజారిటీ తొలగింపులు చట్టబద్ధమైనవే అయినా, బలహీనమైన డాక్యుమెంషన్‌లో పలువురి తొలగింపు వాస్తవమే.
బీహార్ కేసులో బహుళ శక్తుల జోక్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సర్ చేపట్టిన సమయం, దాని ఫార్మెట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఆధార్ ను అందుబాటులో ఉన్న రుజువుగా చేర్చాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రతిపక్షాలు వీటిలో అక్రమాలను ఎత్తిచూపుతూ, జోరుగా ప్రచారం చేపట్టాయి. మీడియా, కొన్ని సంస్థలు క్షేత్రస్థాయిలో పరిణామాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ అప్రమత్తత లేకుంటే, మరికొందరి పేర్లు తొలగిపోయి ఉండేవి, అనర్థం జరిగేది. బీహార్ కేసుతో భారత ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల విచికిత్స మొదలైంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కోటగా పరిగణించిన ఎన్నికల కమిషన్‌ను ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం అనుమానంతో చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రయోజనాలకు కొమ్ముకాస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు, మోడల్ కోడ్ ఉల్లంఘనలపై చర్యల విషయంలో విముఖత చూపడం, ఓటర్ల జాబితా సవరణ వంటి కసరత్తులో పారదర్శకత లేని విధంగా చర్యలు చేపట్టడంతో అనుమానాలు హెచ్చాయి. బీహార్‌లో ఈ ప్రక్రియను ఇసి అధికారికంగా పర్యవేక్షిస్తున్నా, జవాబుదారీతనాన్ని నిర్ధారించేది కోర్టులు, ప్రతిపక్షమే. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలో ఇతరులు జోక్యం చేసుకుని తటస్థతను ఎందుకు కాపాడాలి. ఓటర్ల హక్కులను కాపాడడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఇసి ఎందుకు నిష్క్రియాత్మకంగా కన్పిస్తుంది. నమ్మకం, చట్టబద్ధత కలిగిన సంస్థ పక్షపాత ధోరణితో వ్యవహరించడం తీవ్ర హానికరం.
కేంద్రంలోనూ, రాష్ట్రాలలోని పాలక వర్గాలు ఇటువంటి కసరత్తును తమకు అనుకూలంగా మార్పుకోవాలన్న ఆలోచనే ఎంతో ప్రమాదకరం. మీకు మద్దతు ఇచ్చే అవకాశంలేని ఓటర్లను తొలగించడం లేదా నిరోధించడమే వాటి ఉద్దేశమై ఉంటుంది. బీహార్‌లో పేదవర్గాలు, వలసదారులు, ముస్లింలపై వేటు వేస్తారనే అనుమానాలు తలెత్తాయి. వారు అధికార పార్టీకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉండడమే కారణం. ఇదే నమూనా చాలా చోట్ల కన్పిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని వర్గాల పేర్లు తొలగించారనే ఆరోపణలు అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో పాలక ప్రభుత్వం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు, చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
అసోంలో ఈ వ్యూహం మరింత ఎక్కువ. జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలు కేవలం ఓటర్ల పేర్లను తొలగించే విస్తృత ఎజెండాను ప్రతిబింబించాయి. ముఖ్యంగా ముస్లింలు, అదీ బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలు టార్గెట్ అయ్యారు. దశాబ్దాలుగా నివసిస్తున్న భూముల నుంచి పెద్ద సంఖ్యలో బహిష్కరణకు గురయ్యారు. కీలక డాక్యుమెంట్లు ఉన్నా వారిని తరచు ఆక్రమణదారులుగా ముద్రవేశారు. ఒకసారి భూమిని విడిచి పెడితే వారు తమ శాశ్వత చిరునామా నిరూపించుకునే అవకాశం లేదు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలంటే ఇది తప్పనిసరి. ఉద్దేశపూర్వకంగానే తొలగింపు, హక్కుల తొలగింపు సాగుతున్నాయి. మొదట గృహ స్థిరత్వాన్ని తరస్కరించడం, ఆ తర్వాత ఓటింగ్ హక్కులను తిరస్కరించడం.
బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణకు చేపట్టిన సర్.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు మోడల్‌గా మారితే ఈ వ్యూహాలే భారీస్థాయిలో సంస్థాగతం అయ్యే ప్రమాదం ఉంది. బీహార్‌లో- సర్- ఓటర్ల జాబితా సవరించే ప్రక్రియగా మొదలై పౌరసత్వ పరీక్షగా ఎలా మారిందో మీడియాలో ఓ వర్గం సరిగ్గానే ఊహించింది. ఇది అసోంలో ఎన్‌ఆర్ సిని ప్రతిబింబిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తదుపరి చర్యలు నిలిపివేయకుంటే, దాదాపు 19 లక్షల మంది గల్లంతు అయిపోయేవారే. రెండు సందర్భాలలోనూ అసలు కీలకం ఒక్క. ఓటరే తాను పౌరుడని రుజువు చేసుకోవాలి. లేని పక్షంలో కమిషన్ డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోరుతుంది. పేదలకు అలాంటి ఆధారాలు ఏవీ ఉండవు. బీహార్‌లో ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్‌లలో ఆధార్ ను చేర్చడం ఓ ఊరట. అంతమాత్రాన అధికార బహిష్కరణ ప్రమాదం తొలగిపోదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తోంది. అది షరతులతో కూడిన ఓటు హక్కుగా మారుస్తోంది.
బీహార్ నమూనాను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించడం పెను ప్రమాదం కాగలదు. భారత దేశంలో 97 కోట్ల మంది నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారు. చిన్న స్థాయిలో 5శాతం మంది పేర్లను తప్పుడు ఓటర్లుగా ముద్ర వేసి తొలగించినా ఐదు కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. ఇది అనేక దేశాల్లో ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. ఓటర్ల తొలగింపు అన్నది సామాజిక భౌగోళికంగా కూడా ముఖ్యమైంది. వలస కార్మికులు, పట్టణ పేదలు, భూమిలేని రైతులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు. ఈ వర్గాలు ఇప్పటికే వ్యవస్థపరంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. పేదరికం, స్థానభ్రంశం, డాక్యుమెంషన్ లేకపోవడంతోపాటు ఎన్నికల హక్కు తొలగిస్తే, వారు రాజకీయంగా కూడా లేకుండాపోతారు. అక్రమ వలసదారుల కథనం అసోం, సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యే అవకాశం లేదు. రాజకీయాలు మరింత ముదిరి పాలక వ్యవస్థలు తమను విమర్శించే వర్గాలపై ఈ గొడ్డలి ఉపయోగించవచ్చు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాలి. ప్రజాస్వామ్యానికి నిష్పాక్షికతతో కూడిన సంరక్షకుడిగా వ్యవహరించాలి. అందుకు అనేక చర్యలు చేపట్టడమే తక్షణ కర్తవ్యం. 1. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులో పారదర్శకత ప్రదర్శించాలి. ప్రతి తొలగింపుపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి. అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 2. స్వతంత్ర పర్యవేక్షణ- ఓటర్ల జాబితా సవరణ పర్యవేక్షణలో పౌరసమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు. స్వతంత్ర పరిశీలకులు అధికారికంగా పాల్గొనే అవకాశం కల్పించాలి. 3. చట్టపరమైన రక్షణలు కల్పించాలి,- ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో స్పష్టమైన పరిమితులను చట్టబద్ధం చేయాలి. ఏకపక్షంగా తొలగింపు ఉండరాదు. 4. డిజిటల్ జవాబుదారీతనం -సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఆధార్ ఇతర డేటా బేస్ లు అడ్డంకులు కాకుండా సులభతరం చేయాలి. 5. ప్రజా విశ్వాసం -ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని కనబడాలి, మోడల్ కోడ్ ఉల్లంఘించిన వారిని శిక్షించడంలో సమానత్వం పాటించడం, అన్ని పార్టీలను సంప్రదించడం, ఓటర్ల చేరికకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి వి పారదర్శకంగా సాగాలి.
ఓటర్ల జాబితాపై పోరాటం కేవలం పరిపాలనాపరమైనది కాదు. అస్తిత్వానికి సంబంధించినది. కులం, మతం, వర్గం లింగ భేదం లేకుండా ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలన్న సూత్రం భారత ప్రజాస్వామ్యానికి కీలకం, ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు ఈ హక్కును నీరుగార్చడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బీహార్ అనుభవం రానున్న ముప్పును, అవకాశాలను రెండింటినీ చూపుతోంది. అడ్డుఆపూ లేకుండా సర్ నిర్వహిస్తే లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోతారు. బీహార్ సర్ నిర్వహణ విషయంలో ప్రతిపక్షల అప్రమత్తత, న్యాయవ్యవస్థ జోక్యం, మీడియా పర్యవేక్షణ దిద్దుబాటుకు తోడ్పడ్డాయి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికి ఇవి ప్రత్యామ్నాయం కావు. భారతదేశం అంతటా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి సవరణలను విస్తరించేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్‌కు బీహార్ పాఠాలు హెచ్చరిక కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా చర్య తీసుకోవల్సిన సమయం ఆసన్నమైంది. ఇసి తన స్వతంత్ర, న్యాయమైన వారసత్వాన్ని నిపులుకోవాలి. పౌర సమాజం, రాజకీయ ప్రతిపక్షం అప్రమత్తం కావాలి. బ్యాలెట్‌పై నమ్మకం లేకుంటే ప్రజాస్వామ్యానికి మనుగడలేదు.
గీతార్థ పాఠక్