మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మ రో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ‘దున్నపోతు’వ్యాఖ్యలు అధికార పా ర్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం సమిసిపోయినట్టేనని భా వించిన తరుణంలో మంగళవారం మరింత రాజుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యలకు బుధవారం వరకు క్షమాపణ చెప్పకపోతే తదుపరి పరిణామాలకు బాధ్యతవహించక తప్పదని మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేసారు. దళిత సామాజికవర్గం నుంచి తనను మంత్రిగా నియమించడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని ఆడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి మరోమంత్రి వివేక్ వెంకటస్వామి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఏదైనా మీటింగ్‌కు తాను వెళితే, తన పక్కన కూర్చొవడానికి కూడా ఇష్టపడని మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా ఉండగా మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై చర్య తీ సుకోవాలని కోరుతూ సొంత పార్టీకి చెందిన దళిత సామాజికవర్గం ఎ మ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి డిమాండ్ చేసారు.
ఈ వివాదాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను ఆరా తీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల మధ్య పంచాయతీ ఏంటని అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పరిస్థితి చేయిదాటక ముందే ఈ వివాదాన్ని పరిష్కారించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్‌కు ఫోను చేసి ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని ఆదేశించారు. అయినప్పటికీ పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో బుధవారం వీరిద్దరిని పిలిచి చర్చించబోతున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపారు.
దళిత ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారు : మహేశ్‌కుమార్
మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల దళిత ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని వారిద్దరికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ముగియకపోవడంతో బుధవారం మంత్రులు ఇద్దరిని సమావేశపరిచి చర్చించనున్నట్టు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతల పట్ల దురుసుగా వ్యవహరించడం, నోరు పారేసుకోవడం కొత్తకాదని, ఇప్పటికైనా ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనని దళిత సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కాలే యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి డిమాండ్ చేసారు. ఈ అంశంపై ఇప్పటికే తాను వారిద్దరితో ఫోన్లో మాట్లాడానని ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని కోరినట్టు చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం సమసిపోకపోవడంతో వారితో మరొకసారి చర్చించి పొన్నంతో క్షమాపణ చెప్పిస్తానని పీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్టు దళిత ఎమ్మెల్యేల కథనం.
క్షమాపణ చెప్పేదాక వదిలిపెట్టేది లేదు : మంద కృష్ణ, మోత్కుపల్లి
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై వివాదం మరింత ముదరడంతో దళిత సంఘాలు తీవ్రంగా స్పందించాయి. యావత్తు దళితజాతిని అవమాన పరిచే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టేది లేదని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి మెత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఈ అంశంపై వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్క ఆడ్లూరి లక్ష్మణ్ గురించి చేసినట్టుగా భావించడం లేదని, ఇవీ యావత్తు తమ జాతిగురించి చేసినట్టుగా భావిస్తున్నామని మెత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు.
పొన్నంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను సూమోటోగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంగళవారం కమిషన్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.