రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) ఎన్నికల కోడ్ తరువాత అమల్లోకి రానుంది. ఈ పథకం అమల్లోకి వస్తే 7.14 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందే అవకాశం ఉంది. ఈహెచ్‌ఎస్ పథకంలో భాగంగా ఉద్యోగి నెలకు రూ.500ల నుంచి రూ.600ల వరకు చెల్లించే అవకాశం ఉండేలా విధి, విధానాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పలుమార్లు మంత్రులు (కేబినెట్ సబ్ కమిటీ), సిఎస్, సంబంధిత ఉన్నతాధికారులు సమావేశమై విధి, విధానాల గురించి చర్చించారు. అందులో భాగంగా నెలకు ఉద్యోగి నుంచి చందాను వసూలు చేయడంతో పాటు అంతేమొత్తంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా మార్గదర్శకాలను రూపొందించినట్టుగా తెలిసింది. ఉద్యోగులు నెలకు రూ.500లను చెల్లిస్తే మొత్తం రూ.350 కోట్లు జమకానుంది. ప్రభుత్వం కూడా అంతేమొత్తంలో ఈ చందాను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగికి రూ.5 లక్షల వరకు మెడికల్ బీమా అందనుంది. అంతకన్నా ఎక్కువగా ఆస్పత్రులకు ఉద్యోగి చెల్లించాల్సి వస్తే రాష్ట్ర స్థాయి కమిటీ దానిని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకం అమలు చేయడానికి ఇతర రాష్ట్రాల ఆరోగ్య పథకాలు, బీమా కంపెనీల విధి, విధానాలను అధికారులు అధ్యయనం చేయడంతో పాటు నివేదికను సిఎస్‌కు అందచేసినట్టుగా తెలిసింది. ఈ పథకానికి ఏటా దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇహెచ్‌ఎస్ పథకం అమలుకు సంబంధించి ఒక ట్రస్టును ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది. ఈ ట్రస్టుకు సిఎస్ చైర్మన్‌గా, ఆరోగ్యశ్రీ సిఈఓ, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌లతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు మెంబర్‌లుగా వ్యవహారించనున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, కేబినెట్ సబ్-కమిటీ మధ్య జరిగిన చర్చల తర్వాత ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ నిర్ణయాన్ని ప్రకటించింది.