నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి గర్భస్థ శిశువు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గుర్రంపోడు మండలానికి చెందిన కడమంచి మహేష్ భార్య రేణుక మంగళవారం ఉదయం పురిటినొప్పులతో ఆసుపత్రికి రావడంతో వైద్యులు ప్రాథమిక పరీక్షల తర్వాత బేబీ బాగుంది.. వారం తర్వాత రావచ్చు అంటూ తిరిగి పంపారు. ఆమె బయటికి వెళ్లి కొంతసేపటికి మళ్లీ నొప్పులతో విలవిలలాడుతూ ఆసుపత్రికి చేరుకుంది. మళ్లీ పరీక్ష చేసిన వైద్యులు ఈసారి బిడ్డ రెండు రోజుల క్రితమే గర్భంలో చనిపోయిందని ప్రకటించారు.
ఇదే వైద్యులు కేవలం గంటల ముందు బేబీ బాగుందని చెప్పడం.. ఇపుడు బేబీ గర్భంలోనే చనిపోయిందని నిర్లక్షంగా చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఇది వైద్యం కాదు. వైద్య హత్య.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి కన్నీళ్లతో.. బిడ్డను చూడలేకపోయిన తండ్రి రోదనతో ఆసుపత్రి ప్రాంగణం కదిలిపోయింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.