దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జో రూట్ (ఇంగ్లండ్) బ్యాటింగ్‌లో, జస్‌ప్రిత్ బుమ్రా (భారత్) బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. రూట్ 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కొంతకాలంగా రూట్ టెస్టుల్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లోనూ అతని అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. ఇంగ్లండ్‌కే చెందిన హ్యారీ బ్రూక్ 868 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా ఆరో, కమిందు మెండిస్ (శ్రీలంక) ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 8వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) తొమ్మిదో, బెన్ డకెట్ (ఇంగ్లండ్) పదో ర్యాంక్‌లో నిలిచారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 13వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
టాప్‌లోనే బుమ్రా
బౌలింగ్ విభాగంలో టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో నిలకడగా రాణించడంతో బుమ్రా టాప్ ర్యాంక్ మరింత పదిలమైంది. బుమ్రా 889 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబడా (సౌతాఫ్రికా) రెండో, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) మూడో, ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లు నాలుగు, ఐదు ర్యాంక్‌లను దక్కించుకున్నారు. భారత బౌలింగ్ సంచలనం మహ్మద్ సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్‌లను సొంతం చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో సిరాజ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. దీంతో బుమ్రా 674 రేటింగ్ పాయింట్లతో 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా 17వ ర్యాంక్‌లో నిలిచాడు.