కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. బెథ్ మూని, అలానా కింగ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. మూని 11 ఫోర్లతో 109 పరుగులు చేసింది. కింగ్ 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
పాక్ బౌలర్లలో నశ్రా సంధు మూడు, ఫాతిమా సనా, షమీమ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 36.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమిన్ (35) ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఆసీసస్ బౌలర్లలో కిమ్ గార్థ్ మూడు, మెగాన్ షట్, సదర్లాండ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని ఘన విజయం సాధించడం విశేషం.