న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 2001లో సరిగ్గా ఇదే రోజు నాటి చిత్రాలను షేర్ చేశారు. ఆరోజు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. “2001 ఇదే రోజున… గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశాను. నా తోటి భారతీయులు నిరంతరం అందిస్తోన్న మద్దతుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వాధినేతగా 25 వ ఏడాది లోకి అడుగుపెడుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజల జీవితాలు మెరుగుపర్చడం కోసం దేశ పురోగతికి నావంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాను ” అని మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ప్రమాణం చేసిన వాటి చిత్రాలను షేర్ చేశారు. మోడీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన వాతావరణ మార్పులకు వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు క్లైమేట్ ఛేంజ్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. 2001లో ఆయన స్వరాష్ట్రం గుజరాత్ భూకంపంతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త వ్యవస్థలు తీసుకువచ్చారు. తన గుజరాత్ మోడల్‌తో 2014 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి ఎన్డీయేను విజయ తీరాలకు చేర్చారు. వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేబట్టారు.