మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా స మ్మక్క-సారక్క ఏర్పాటవుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రూ.800 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. గిరిజన భాషలైన కోయ, బంజారా, గోండుతో రూపొందించిన లోగోను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు అధికంగా ఉండే ప్రాంతంలో సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ రిసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇది దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ వర్సిటీగా నిలుస్తుందన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తేవడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణలో హిందీ, మరాఠాతో పాటు స్థానిక భాషలనూ మెరుగుపరిచేందుకు ఈ ట్రైబర్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ వర్సిటీ గురించి విభజన చట్టంలో పొందుపరచనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. తానూ ఈ వర్సిటీని సందర్శిస్తానని, అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు.ఇదిలాఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక సమ్మక్క-సారక్క పేరిట యూనివర్సిటీని నెలకొల్పడం తెలంగాణ ప్రజలందరూ గర్వించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వర్సిటీకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్సిటీ ద్వారా విద్యా రంగంలో తెలంగాణకు మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.