స్టాక్‌హోమ్ : భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ లభించింది. అమెరికాకు చెందిన జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవొరెట్, జాన్ ఎం మార్టినిస్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఎలక్రిట్ సర్కూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్‌లో ఆవిష్కరణలకు గాను స్టాక్‌హోం లోని రాయల్ స్వీడిష్ అకాడమీ వీరికి ఈ పురస్కారాలను ప్రకటించింది. గత ఏడాది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు ఇద్దరికి నోబెల్ దక్కింది. జాన్ జె హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ హింటన్‌లు దీనిని స్వీకరించారు. మొత్తంగా 19012024 మధ్య కాలంలో 118 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా, 226 మంది దీన్ని అందుకున్నారు. వీరిలో లారెన్స్ బ్రాగ్ 25 ఏళ్ల వయసు లోనే ఈ నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలువగా, ఆర్డర్ అష్కిన్ 95 ఏళ్ల వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
పరిశోధన పూర్వాపరాలు
‘మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్కూట్‌లో శక్తి పరిమాణీకరణ ” అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్‌ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్‌లో చూపించగలిగారు. విద్యుత్ సర్కూట్‌లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్
కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్జిన్‌లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కాగా, హెచ్‌డెవొరెట్ ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త.
క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత
గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతిక శాస్త్రంతో వివరించవచ్చు. కానీ ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లతో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్‌లు,అట్లాంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయిల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్‌ను ఉపయోగిస్తుంటారు కదా.. అచ్చం అలాగే శక్తి కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే అణుస్థాయిలో ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినట్టు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు విజేతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్‌ను కూడా అరచేతిలో పట్టేంత , పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు. క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం.
ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలేర్పడింది. గూగుల్ , ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ కూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగా తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి. అంతేకాదు ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే వీలేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియోలాజికల్, సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి సమస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపించేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చు. సోమవారం (అక్టోబర్ 6) వైద్యరంగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు. శుక్రవారం శాంతి బహుమతితోపాటు అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను వెల్లడిస్తారు.