ప్రాణం పోయవలసిన ఔషధాలే ప్రాణాలను బలిగొంటున్న వైచిత్రి! కల్తీ మందులు విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్‌లో లభ్యం కావడమే కాదు, వైద్యులు ఇష్టారీతిన వాటిని సూచించడం లేదా ఔషధ దుకాణాల్లోని అమ్మకందారులే డాక్టర్లుగా అవతారమెత్తి, పేదప్రజలకు ఔషధాలను సూచిస్తూ వారి ప్రాణాలతో ఆటలాడుకోవడం వంటి సంఘటనలు అత్యధిక జనాభాగల ఆసియా దేశాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది వర్షాకాలం కావడంతో దగ్గు, జలుబు, జ్వరం వంటివి సర్వసాధారణం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు ఇలాంటి వాటికి త్వరగా లోనవుతారన్నదీ అంతే నిజం. అంతమాత్రాన, దగ్గు వస్తే వాడే ఓ సిరప్ ప్రాణాంతకమవుతుందని ఎవరైనా కలగంటారా? మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఓ దగ్గు మందును వాడిన 14 మంది చిన్నారులు గంటల వ్యవధిలో దారుణమైన దుష్పరిణామాలకు లోనై మరణించడం విభ్రాంతి గొలుపుతోంది.
తమిళనాడులో తయారైన సదరు దగ్గుమందులో డైఇథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం 48 శాతానికి పైగానే ఉందట. సాధారణంగా 0.1 శాతానికి మించకూడని ఈ రసాయనం 480 రెట్లు ఎక్కువగా ఉందంటే, ఔషధ తయారీలోనూ, ఆ మందు విక్రయానికి అనుమతి మంజూరు చేయడంలోనూ ఎంతటి నిర్లక్ష్యం చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర నాడీవ్యవస్థను దెబ్బతీసి, మూత్రపిండాలపై ప్రభావం చూపి, మనిషి మరణానికి కారణమయ్యే ఇంతటి విషపూరిత రసాయనాన్ని అంత ఎక్కువ మోతాదులో ఎలా వాడారన్న దానిపై నిగ్గు తేలాల్సి ఉంది.
మన దేశంలో కల్తీ మందులు తయారవుతున్నాయనేది ఇప్పుడే వెలుగు చూసిన వాస్తవం కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చేటు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. ఐదేళ్ల క్రితం ఉధంపూర్‌లో జరిగిన కల్తీ మందుల వినియోగం సంఘటనలో 12మంది చిన్నారులు కన్నుమూశారు. మూడేళ్ల క్రితం 2023లో మన దేశంనుంచి గాంబియాకు ఎగుమతైన ఓ దగ్గుమందును వాడిన 66 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం అనంతరం భారత్ నుంచి ఎగుమతయ్యే దగ్గుమందులపై అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశదేశాలనూ హెచ్చరించింది. కోవిడ్ సమయంలో వంద కోట్ల వ్యాక్సీన్ డోసులను ఎగుమతి చేసి, వేనోళ్ల ప్రశంసలందుకున్న మన దేశం పరువు ప్రతిష్ఠలు ఈ సంఘటనతో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రపంచానికి ఫార్మా రాజధానిగా పేరొందిన భారతదేశం వైపు అనేక దేశాలు అనుమానపు దృక్కులు సారించాయి. అయినప్పటికీ మనం గుణపాఠం నేర్వలేదనడానికి తాజా సంఘటనే ఉదాహరణ. అనర్థం జరిగాక మేలుకోవడం, హడావిడి చేయడం మన ప్రభుత్వ యంత్రాంగాలకు పరిపాటి.
తాజా సంఘటన వెలుగు చూడగానే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ రంగంలోకి దిగి, చాలా సందర్భాల్లో దగ్గు దానంతట అదే తగ్గిపోతుంది కాబట్టి రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు సూచించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి, అదే నిజమైతే, ఇంతకుముందే ఇలా హెచ్చరించి ఉండవచ్చుకదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గుమందును సూచించిన వైద్యుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం జరిగిన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. పలు రాష్ట్రాలు సదరు దగ్గుమందును నిషేధించాయి. తమిళనాడు ప్రభుత్వం ఆ మందును తయారీ చేసిన కంపెనీ లైసెన్స్ రద్దుకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవన్నీ కంటితుడుపు చర్యలే. ఔషధ దుకాణాలు, ఫార్మా కంపెనీలలో తరచూ తనిఖీలు చేపట్టి, నకిలీ, నాసిరకం మందుల తయారీదారుల భరతం పట్టవలసిన ఔషధ నియంత్రణ సంస్థలు సిబ్బంది లేమితో కునారిల్లుతున్నాయనేది చేదు నిజం. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అరకొర సిబ్బందితో ఈ సంస్థలు తమ విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయి.
ఒకవైపు ఆస్పత్రులలో సౌకర్యాల లేమి, మరొకవైపు కల్తీ మందుల విజృంభణ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. తాజా సంఘటనలో ఇంతటి విషపూరితమైన దగ్గుమందును తయారుచేసినవారిని, దాన్ని మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులను అరెస్టు చేసి, జైలుకు పంపాలి. ఈ సంఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ ఔషధ నియంత్రణ శాఖలను తగిన సిబ్బందితో పరిపుష్టం చేయాలి. నకిలీ మందుల తయారీ గుట్టురట్టు చేసేందుకు, వాటి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు దాడులను ముమ్మరం చేయాలి. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించడం ఎంతమాత్రమూ క్షంతవ్యం కాదు.