పెందుర్తి: విశాఖ జిల్లా పెదగాడి గ్రామంలో దుర్గామాత ఉత్సవ ముగింపు ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా భార్యతో పాటు భర్త ఉత్సాహంగా నృత్యం చేశాడు. ఊరేగింపులో భార్యతో డాన్స్ చేస్తూ, పాట పూర్తయిన వెంటనే భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇలా జరగడంతో పండగవేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం డిజె సౌండ్ అధికంగా ఉండటంతో గుండెపోటుతో మృతి చెందాడని భావిస్తున్నారు. మృతుడు అప్పికొండ త్రినాథ్(56) డ్రైవర్ గా పనిచేస్తుంటారని, ఈయనకు భార్య, లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు తెలిపారు.