జాతిపిత గాంధీ గౌరవం తగ్గించడానికో లేదా పౌరులను తప్పు పట్టడానికో కాదు గాని ఈసారి గాంధీ జయంతి, విజయదశమి నువ్వా నేనా అన్నట్లు రెండూ ఒకే రోజున వచ్చి అందరినీ ఇరకాటంలో పెట్టాయి. ఒకటి జాతి పండుగ, రెండోది జనులకు ఇష్టమైన పర్వదినం. ప్రభుత్వ పెద్దలు గాంధీకి శ్రద్ధాంజలి ఘటించగా, జనం నోటికి పండుగ రుచులను అందించడానికి పక్కదారులు తొక్కారు. షరా మామూలుగా ప్రభుత్వ అధికారులు అక్టోబర్ 2 న లిక్కర్ షాపులకు డ్రై డే అంటూ, మాంసం దుకాణాలు తెరవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ రోజు ప్రజలు, వ్యాపారులు వ్యవహరించిన తీరు దాయలేని సత్యమే. నిషేధిత ఉత్తర్వులున్నా దసరా పండుగను మద్యం, మాంసంతో ఉల్లాసంగా జరుపుకోవాలనుకొన్న వారికి లోటేమి రాలేదు. చాలా మంది ముందు జాగ్రత్తగానే అన్నింటిని సమకూర్చుకున్నారు.అందుకు మార్కెట్ కూడా వారికి పూర్తిగా సహకరించింది. అక్టోబర్ 2 నాడు లిక్కర్ షాపులు షట్టర్ ఎత్తకున్నా మద్యప్రియుల దసరా సంబరాలకు ఇబ్బందేమీ కలగలేదు. ముందే కొనుక్కున్నా చెడిపోయే వస్తువు కాదు కాబట్టి కావలసినన్ని బాటిళ్లను మూడు రోజుల ముందుగానే ఇంట్లోకి చేరవేసుకున్నారు.
గాంధీ జయంతి రోజు అమ్మడం తప్పు కానీ, సేవించడం తప్పు కాదు అన్నట్లుగా డ్రై డే కొనసాగింది. ముందే ఎక్కువ మొత్తంలో మద్యం సీసాలు కొనేసి దసరా, గాంధీ జయంతి రోజున చాటుమాటుగా డబుల్ రేటుకు అమ్మి లాభపడ్డవారు కొందరు. డ్రై డేకి ముందు నాలుగు రోజుల్లో రూ. 800 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయని మన ఎక్సయిజ్ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచే మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయట. గత సెప్టెంబర్ నెలతో పోల్చితే ఈసారి రూ. 200 కోట్ల అమ్మకాలు పెరిగాయట. ఇక మటన్, చికెన్ విషయానికొస్తే ఆ దుకాణాలు అక్టోబర్ 1 నాడు పగలు, రాత్రి అనకుండా అమ్మకాలు సాగిస్తూ తెల్లవారి 2 నాడు ఉదయం నాలుగు గంటల దాకా తెరిచి ఉంచి నిరాటంకంగా బేరాలు జరిపాయని వార్తలు వచ్చాయి. జయంతి రోజున కూడా చికెన్ షాపులు ఒక్కో కోడిని కోసుకుంటూ సేల్స్‌కి ఇబ్బందిరాకుండా చూసుకున్నారు. ఊర్లలో సొంతంగా గొర్రెలను తెచ్చినవారు తెల్లారేలోపే కోసి కుప్పలువేసి అమ్మేసుకున్నారట. పైగా ఇదే సందు అన్నట్లు రేట్లు కూడా పెంచేశారని తెలుస్తోంది.
ఇక చెప్పేదేముంది? ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు లిక్కర్, నాన్ వెజ్ షాపులకు బంద్‌ఫ్లెక్సీలు రెపరెపలాడుతుండగా దసరా పండుగ మందు, మాంసంప్రియుల ఇష్టానుసారంగా ముగిసింది. మున్సిపల్‌శాఖ కూడా అటు గాంధీ జయంతి, ఇటు దసరా పండుగ దిగ్విజయంగా సాగేలా తోడ్పడింది. ఈ సఫల వైఫల్యం గురించి పత్రికలు, చానళ్ళు నోరు మెదపకున్నా సోషల్ మీడియాలో బాగానే హల్‌చల్ సాగింది. అసలు మాంసం తినడం నేరం కానప్పుడు గాంధీ జయంతి రోజున ఎందుకు తినవద్దు అనే దిశగా చర్చసాగింది. గాంధీ అహింసావాదానికి, దేశంలో 90% ప్రజల ఆహారమైన జంతు మాంసానికి సంబంధమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. గాంధీ ఆచరించిన అహింస సిద్ధాంతం రక్తం చిందకుండా, హింస ద్వారా కాకుండా, సత్యాగ్రహం ద్వారా సమాజంలో మార్పుతేవాలి అని నమ్మేది. ఐక్య రాజ్యసమితి 2007లో గాంధీ పుట్టిన రోజును ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది. అహింస మానవీయతకు మారుపేరే. భూతదయ మనిషి లక్షణం. సాటి ప్రాణులకు హాని తలపెట్టకూడదు. అయితే మాంసాహారం అనాదిగా మనిషి జీవితంలో భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా జంతుమాంసం వినియోగమవుతోంది. ఆహారం కోసమే జంతువులను పెంచి, అవసరానికి ఆరగిస్తున్నారు.
ఇప్పుడది పెద్ద పరిశ్రమ, ఎందరికో జీవనోపాధి. జనాభాలో నాన్‌వెజ్ తినేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంతగా అంటే గాంధీ కోసం ఒక్క రోజు తినకుండా ఉండలేనంత. గాంధీ జయంతి రోజును దేశంలోని మిగతా ప్రాంతాలు, రాష్ట్రాలు జరుపుకుంటున్న, ఆచరిస్తున్న తీరు భిన్నంగా ఉంది. అక్టోబర్ 2న జాతీయ స్థాయిలో డ్రై డే పాటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మద్యం, మాంసం నిషేధం కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మటన్ షాపులు మూసిఉంటాయి. ఢిల్లీలో మాంసం అమ్ముతారు. మాంసాహార అమ్మకాల నిషేధం అనేది రాష్ట్రాల స్థానిక పురపాలికలు తీసుకొనే నిర్ణయం. ఏ కారణంగానైనా మున్సిపాలిటీలు తమ పరిధిలో నాన్‌వెజ్ అమ్మకాలను నిలిపివేయవచ్చు. కోళ్లకు, గొర్లకు వ్యాధులు సోకినప్పుడు కూడా ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇలాంటి నిషేధాలు ప్రకటిస్తుంటాయి. కృష్ణాష్టమి, మహావీర్ జయంతి రోజుల్లో కూడా మాంసం అమ్మకాలు ఆపేశాయి.అలా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా మద్య నిషేధంఉన్నా నాన్‌వెజ్ అమ్మకాల విషయంలో ఏకరూపత లేదు. పండుగలు, ప్రజల మధ్యన గాంధీని నిలబెట్టి ఆయన సిద్ధాంతాలకు ఇలా అగ్నిపరీక్ష పెట్టకుండా ప్రభుత్వాలు మార్పులు తేవాలి.
బద్రి నర్సన్, 9440128169