ఐసిసి మహిళ వన్డే ప్రపంచకప్‌లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి మహిళ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చేసిన సెంచరీతో ఈ ఘనతను సాధించింది. గతంలో ఈ రికార్డు టీం ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేరిట ఉండేది. స్మృతి ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సెంచరీలు సాధించింది. తాజాగా తజ్మిన్ ఈ రికార్డును బ్రేక్ చేసింది.
దీంతో పాటు తజ్మిన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 7 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ఆసీస్ ప్లేయర్ మెగ్ లాన్నింగ్ రికార్డును సొంతం చేసుకుంది. లాన్నింగ్ వన్డేల్లో 44 ఇన్నింగ్స్‌లో 7 సెంచరీలు చేయగా.. తజ్మిన్ 41 ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేసి రికార్డు బద్దలు కొట్టింది. వీరిద్దరు మినహా ఏ మహిళ క్రికెటర్ కూడా ఈ రికార్డును 50 ఇన్నింగ్స్ లోపు సాధించలేకపోయారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తజ్మిన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి.. 40.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.