ముంబై: మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా వ్యవహరించే సత్తా శుభ్‌మన్ గిల్‌కు లేదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే గిల్‌కు టెస్టులతో పాటు వన్డేల్లో సారథ్య బాధ్యతలు అప్పగించారని, అయితే టి20లలో అతన్ని సారథిగా ఎంపిక చేసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ టి20 కెప్టెన్‌గా ఇప్పటికే తానెంటో నిరూపించాడన్నాడు. అతనితో పోల్చితే ఈ ఫార్మాట్‌లో గిల్ రికార్డు అంతంత మాత్రమేనన్నాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ను తప్పించి శుభ్‌మన్‌కు టి20 టీమ్ పగ్గాలు అప్పగించడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. ఇక రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వచ్చే వరల్డ్‌కప్ వరకు వన్డేల్లో రోహిత్‌ను సారథిగా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. ఇక గిల్ వన్డేల్లో సత్తా చాటే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని ఉతప్ప పేర్కొన్నాడు.